దూసుకొస్తున్న బిపోర్‌జారు..

– గుజరాత్‌లో భారీ వర్షాలు..
న్యూఢిల్లీ / ముంబయి : బిపోరిజారు తుఫాను గుజరాత్‌ వైపుకు దూసుకువస్తోంది. దీని ప్రభావంతో గుజరాత్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గురువారం మధ్యాహ్నం కచ్‌, పాకిస్తాన్‌లోని కరాచీల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. గుజరాత్‌లోని కచ్‌ మరియు సౌరాష్ట్ర జిల్లాల్లోని తీరం నుంచి 10 కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారి కోసం ఆహారం, మందులను సిద్ధం చేశారు. కచ్‌, జామ్‌ నగర్‌, మోర్బీ, గిర్‌ సోమ్‌నాథ్‌, పోర్‌బందర్‌ మరియు దేవ్‌భూమి, ద్వారకా జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీయనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు ముందస్తు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ ఎఫ్‌ బందాలను మోహరించాయి.
పలు రైళ్లు రద్దు
తుఫాను ప్రభావంతో వందకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్టు పశ్చిమ రైల్వే పేర్కొంది. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను కుదించారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబయిలో విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముంబయిలో ఇద్దరు యువకులు మరణించగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. గుజరాత్‌లోనూ ముగ్గురు మరణించారు.
గుజరాత్‌ సీఎంకు మోడీ ఫోన్‌
తుపాను ముప్పు నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్లో మాట్లాడారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Spread the love