500 విమానాలకు ఇండిగో ఆర్డర్‌

ముంబయి : భారత విమానయాన రంగంలో అతిపెద్ద ఒప్పందం చోటు చేసుకుంది. చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఏకంగా 500 విమానాల కొనుగోలు కోసం ఎయిర్‌బస్‌తో డీల్‌ కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇండిగో వద్ద 300 విమానాలున్నాయి. ఇటీవల 480 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ చేసింది. అవి తన చేతికి రాకముందే.. తాజాగా 2030-2035 మధ్య డెలివరీ కోసం మరో 500 విమానాల కోసం ఒప్పందం చేసుకోవడం ఆ రంగం పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. వచ్చే 10 ఏళ్ల కాలంలో 1,000 విమానాలు డెలివరీ కావాల్సి ఉందని ఆ సంస్థ పేర్కొంది. తాజాగా ఆర్డర్‌ చేసిన విమానాల్లో ఎ320 నియో, ఎ321 నియో, ఎ321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానాలు ఉన్నాయి. వీటి విలువ 50 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4 లక్షల కోట్లు) ఉండొచ్చని అంచనా. ఇంతక్రితం టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా 470 విమానాల కోసం బోయింగ్‌, ఎయిర్‌బస్‌తో ఒప్పందం చేసుకున్న రికార్డ్‌ను ఇండిగో అధిగమించినట్లయ్యింది.
ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 56 శాతం వాటా ఉంది.

Spread the love