డైలీ సీరియల్‌

– గడువు పొడిగించినా వెలుగు చూడని వాస్తవాలు
– ప్రభుత్వ పెద్దల ప్రమేయముందన్న అనుమానాలు
అదానీ గ్రూపు కంపెనీలలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న విచారణ డెయిలీ సీరియల్‌ తరహాలో సా…గుతూనే ఉంది. సెబీ విచారణలో వాస్తవాలు బయటపడితే మోడీ సర్కారు అప్రదిష్టపాలవుతుందని, రాబోయే లోక్‌సభ ఎన్నికలలో దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. అందుకే ఢిల్లీ పెద్దల ఆదేశానుసారం విచారణను ఏదో ఒక సాకుతో సాగదీస్తున్నారు. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సెబీ వైఖరిని తప్పుపట్టగా, ఆ సంస్థ మాత్రం తన వాదనను గుడ్డిగా సమర్ధించుకుంటోంది.
సెబీ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు విచారణ గడువును పెంచినప్పటికీ ఇప్పటికీ అతీగతీ లేదు. సెబీ తన విచారణను త్వరగా ముగించి, వాస్తవాలను బహిర్గతం చేయడం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సుతరామూ ఇష్టం లేదు.
న్యూఢిల్లీ : 2016 నుండి అదానీ గ్రూపుపై వచ్చిన పలు ఆరోపణల్లో నిజాలను నిగ్గు తేల్చేందుకు సెబీ విచారణ జరుపుతోంది. హిండెన్‌బర్గ్‌ ప్రస్తావించిన అవకతవకలను కూడా సెబీ విచారిస్తోంది. అయితే ఈ విచారణలో ఏం తేల్చారో ఇప్పటి వరకూ బహిర్గతం చేయలేదు. సెబీ ఇటీవల కోరలు తీసిన పాము చందంగా తయారైందని ‘ది మార్నింగ్‌ కంటెస్ట్‌’ అనే సంస్థ చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం. మధ్యంతర ఆదేశాలు ఇవ్వడం, విచారణలను అసంపూర్తిగా ముగించడం వంటి పనులకే సెబీ పరిమితమవుతోందని ఆ సంస్థ తెలిపింది. అదానీ గ్రూపు కంపెనీలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయన్న దానిపై జరిపిన విచారణలో సెబీ కొంత పురోగతి సాధించిందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అయితే పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలకు చట్టాలలోని నిబంధనలు అండగా నిలుస్తున్నాయి. దీంతో వాస్తవాలు వెలుగు చూడడం లేదు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) అదానీ గ్రూపులో మదుపు చేసిన పెట్టుబడులపై విచారణలో సెబీ ముందడుగు వేయలేకపోయిందని, దాని చేతులు కట్టేశారని నిపుణులు తేల్చేశారు. అయితే వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై సెబీ తన స్పందనను తెలియజేస్తూ తనను తాను గట్టిగా సమర్ధించు కుంది. కమిటీ అభిప్రాయాలతో విభేదించింది. ఎఫ్‌ పీఐల యాజమాన్యపు హక్కులపై విచారణ జర పడంలో తన సామర్ధ్యాన్ని శంకించాల్సిన అవసరం లేదని సర్టిఫికెట్‌ ఇచ్చుకుంది. సుప్రీంకోర్టుకు నిపు ణుల కమిటీ 170 పేజీల నివేదికను అందించగా, సెబీ 40 పేజీల స్పందనను తెలియజేసింది. ఇక్కడ ఓ విషయాన్ని మరచిపోకూడదు. అదానీ- హిండెన్‌బర్గ్‌ కుంభకోణం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసింది. సెబీ తన విచారణను వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు బహిర్గతం చేసి ఉంటే అది బీజేపీ రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధమై ఉండేది. ఒకవేళ విచారణ మరింత ఎక్కువ కాలం జరిగితే సెబీ పనితీరు పైన, దాని వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం పైన ప్రశ్నలు ఎదురవుతాయి.
కమిటీతో విభేదించిన సెబీ
తన విచారణలో పురోగతిని నిపుణుల కమిటీ సరిగా అర్థం చేసుకోలేదని సెబీ అంటోంది. కమిటీ చెబుతున్నట్లు తాను విచారణ ప్రక్రియను నీరుకార్చలేదని, వాస్తవానికి మరింత బలం చేకూర్చానని చెప్పుకుంది. ఎఫ్‌పీఐ పెట్టుబడులలో అసలైన యజమానులు ఎవరో వెల్లడించాల్సిన అవసరం లేదంటూ సెబీ నిబంధనావళిలో చేసిన సవరణ కారణంగానే ఈ ప్రక్రియ మొత్తం నీరుకారిందని నిపుణుల కమిటీ తెలిపింది. అయితే దీనితో సెబీ ఏకీభవించడం లేదు. సెబీ నిబంధనల్లో చేస్తున్న మార్పులు విచారణకు ప్రతిబంధకంగా మారాయని, వాటివల్ల వాస్తవాలు రాబట్టడం కష్టమవుతోందని కమిటీ తన నివేదికలో తెలిపింది. అయితే నిపుణుల కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సెబీ ఏ దశలోనూ ఏకీభవించలేదు. అయితే సెబీ విశ్వసనీయతపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
వాటాదారుల అనుమానాలు
హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆరోపించిన విధంగా అదానీ గ్రూపు ఉల్లంఘనలకు, అవకతవకలకు పాల్పడినట్లు నేరం మోపవచ్చా లేదా అనేది తేల్చాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. ఇందుకు రెండు నెలల గడువు విధించింది. ఈ గడువు మేతో ముగిసింది. అయితే గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని సెబీ కోరింది. కోర్టు మాత్రం మూడు నెలలు అంటే ఆగస్ట్‌ 14వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. విచారణకు తీసుకుంటున్న సమయాన్ని కూడా నిపుణుల కమిటీ ప్రశ్నించింది. అయితే విచారణ సరిగా జరగాలంటే సమయం పడుతుందని సెబీ వాదించింది. సెబీ అభిప్రాయంపై వాటాదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణకు కాలపరిమితి విధించకూడదని సెబీ భావిస్తున్నట్లుగా ఉన్నదని వారు అంటున్నారు. భారతీయ సెక్యూరిటీల మార్కెట్‌ ప్రయోజనాలను, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను సెబీ విస్మరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెబీ ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగింపును కోరిందని గుర్తు చేస్తున్నారు. ఇందులో ఏదో మతలబు ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సెబీ తన విచారణను ముగించి, ఆ నివేదికను బహిర్గతం చేస్తే అది లోక్‌సభ ఎన్నికలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.
విచారణలో భాగస్వాములు కావాల్సిందిగా సెబీ చేసిన అభ్యర్థనను ఈడీ, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు తోసిపుచ్చాయని తెలుస్తోంది. అంతర్జాతీయంగా సమాచారాన్ని సేకరించేందుకు అది చేస్తున్న ప్రయ త్నాలు కూడా విఫలమయ్యాయి. ఒకవేళ ఎఫ్‌పీఐ లకు సంబంధించి సెబీ వద్ద తగినంత సమాచారం ఉంటే అది ఎలా స్పందిస్తుందన్నది కూడా ప్రశ్నార్థ కంగా ఉంది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చిన తర్వాత అనేక అనుమానాలు కలుగుతున్నాయి. హిండెన్‌బర్గ్‌ నివేదికపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ చివరికి అదానీ గ్రూపుకు క్లీన్‌చిట్‌ ఇస్తుందా? ఏమో వేచి చూడాల్సిందే.
తెర వెనుక సూత్రధారులు ఎవరు?
నిపుణుల కమిటీ నివేదికపై సెబీ స్పందనలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే… అదానీ గ్రూపులో 13 ఎఫ్‌పీఐలు (12 ఎఫ్‌పీఐలు మారిషస్‌లోనూ, ఒకటి సైప్రస్‌లోనూ రిజిస్టర్‌ అయ్యాయి) భారీగా పెట్టుబడులు పెట్టాయి. వాస్తవానికి ఈ ఎఫ్‌పీఐలకు అదానీ గ్రూపు యాజమాన్యంతో సంబంధాలు ఉన్నాయని, అవి ఆ గ్రూపుకు ప్రాక్సీలుగా వ్యవహరించాయని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. ఒకవేళ ఎఫ్‌పీఐలు నిజంగానే ప్రాక్సీలుగా వ్యవహరిస్తే వారికి ఆ గ్రూపు కంపెనీలలో 75%కి పైగా వాటాలు ఉంటాయి. ఇది సెక్యూరిటీల చట్టాన్ని ఉల్లంఘిం చడమే అవుతుంది. గ్రూపులోని కంపెనీలకు, ఎఫ్‌పీఐలకు మధ్య జరిగిన లావాదేవీలను అదానీ గ్రూపు బహిర్గతం చేయలేదు. ఇది కూడా చట్ట ఉల్లంఘనే. ఎఫ్‌పీఐలు ప్రాక్సీలు అయితే వారు అదానీ గ్రూపు వాటాలలో పెట్టుబడులు పెట్టడం షేర్‌ మార్కెట్‌ను మోసగించడమే అవుతుంది. పైన తెలిపిన సందర్భాలలో చట్ట ఉల్లంఘన జరిగిందా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత సెబీదే. ఎఫ్‌పీఐ పెట్టుబడులలో అసలైన లబ్దిదారులు, తెర వెనుక సూత్రధారులు ఎవరో అది తెలుసుకోవాలి. అయితే ఆ విషయాన్ని సెబీ నిగ్గు తేల్చలేకపోయిందని నిపుణుల కమిటీ తేల్చింది.

Spread the love