ఉద్యమం ఉధృతం

– ఆగని రెజ్లర్ల పోరాటం
– ఇండియా గేట్‌ వద్ద కొవ్వొత్తులతో కవాతు
– కదంతొక్కిన పౌర సమాజం
– నెల రోజులు పూర్తి చేసుకున్న మల్లయోధుల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు ప్రారంభించిన ఆందోళన రోజురోజుకూ ఉధృతమవుతోంది. మంగళవారం నాటికి ఈ ఉద్యమం ..నెల రోజులు పూర్తి చేసుకున్నది. ఈ నేపథ్యంలో మంగళవారం జంతర్‌ మంతర్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు వేలాది మంది ప్రజలు క్యాండిల్‌ లైట్‌ మార్చ్‌ చేపట్టారు. రెజ్లర్లకు మద్దతుగా ఢిల్లీ వీధుల్లో పౌర సమాజం కదం తొక్కింది. పోరాట వేదిక జంతర్‌మంతర్‌ నుంచి కాలినడకన అగ్రశ్రేణి రెజ్లర్లు ప్రారంభించిన పాదయాత్రలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు తరలివచ్చి పాల్గొన్నారు. ప్లకార్డులు చేబూని నినాదాలు హౌరెత్తించారు. జాతీయ జెండాలను భుజాన వేసుకొని రెపరెపలాడించారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే నిరసనలను అనుమతించే ఇండియాగేట్‌ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. వాహనాల రాకపోకలను కూడా దారి మళ్లించారు.
జమ్మూ కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ వీల్‌ఛైర్‌లోనే హాజరయ్యారు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియా, సంగీతా ఫోగట్‌, సత్యవర్త్‌ కడియన్‌ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లతో పాటు వేలాది మంది ప్రజలు ప్రదర్శనలో భాగస్వామ్యం అయ్యారు. రెజ్లర్ల అభ్యర్థన మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చాతోపాటు రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. నిర్భయ ఉద్యమం తర్వాత, ఈ ఉద్యమం ఇండియాగేట్‌ ప్రాంతంలో అతిపెద్ద మహిళా ఉద్యమంగా మారింది. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేసే వరకు పోరాటం నుంచి వెనక్కి తగ్గబోమని వినేశ్‌ ఫోగట్‌తో సహా నిరసనకారులు ప్రకటించారు. బ్రిజ్‌భూషణ్‌ నార్కోటెక్‌ పరీక్ష చేయించుకోమని చేసిన ఛాలెంజ్‌ను స్టార్స్‌ కూడా స్వీకరించారు.

Spread the love