– దోపిడీ అంతమవ్వాలి
నయా ఉదారవాద సంస్కరణలు, గుత్తాధిపత్యం ఫలితంగా సుందరయ్య కాలం నుంచి గ్రామీణ పరిస్థితులు, వ్యవసాయ సంబంధాలు పెద్ద మార్పునకు గురయ్యాయి. ప్రస్తుతం పెద్ద రైతులకు, భూ యజమానులకు భూమిపై వచ్చే ఆదాయం ఒక్కటే కాదు. అనేక ఇతర ఆదాయ వనరులు ఉన్నాయి. చిన్న రైతులు, రైతు కూలీల్లో మార్పు వచ్చింది. వ్యవసాయ కూలీల్లో అధిక శాతం వలస కార్మికులుగా మారారు. నగరాల నిర్మాణ రంగంలో వారు విస్తృతంగా ఉపాధి పొందుతున్నారు. కానీ వారు గ్రామీణ బంధాలను పూర్తిగా వదులుకోలేదు. మారిన ఈ పరిస్థితులకు అనుగుణంగా గ్రామాల్లో ధనిక వర్గానికి వ్యతిరేకంగా కొత్త ఉద్యమాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.
-సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ద్రోపిడీకి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మించాలి
– దేశ వ్యవసాయ రంగంపై సుందరయ్యది లోతైన వగాహన: పిఎస్ స్మారకోపన్యాసంలో ప్రకాశ్ కరత్
గ్రామాల్లో దోపిడీదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరగాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ పిలుపు ఇచ్చారు. మంగళవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ (హెచ్‌కేఎస్) భవన్‌లో పి.సుందరయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి వార్షిక పి సుందరయ్య స్మారక ఉపన్యాస కార్యక్రమం ట్రస్ట్ డైరెక్టర్ బోర్డు సభ్యులు, ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే అధ్యక్షతన జరిగింది. వ్యవసాయ సమస్యలకు పుచ్చలపల్లి సుందరయ్య రచనలు, దాని సమకాలీన ఔచిత్యంపై సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడా భూ యజమానులతో పాటు ధనిక దోపిడీదారులకు వ్యతిరేకంగా చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంత కార్మికులతో కూడిన సంఘాన్ని ఏర్పాటు చేసి ఉపాధి, వేతనాలు, జీవనోపాధి, లింగ వివక్ష, కుల వివక్ష తదితర గ్రామీణ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. 1964లో పార్టీ కార్యక్రమంలో వ్యవసాయ భాగం రూపొందించబడిందని, 1967లో కేంద్ర కమిటీ రైతుల ఫ్రంట్ విధులను ఆమోదించిందని వివరించారు. పార్టీ ప్రధాన కార్య దర్శి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని రెండు తీరప్రాంత గ్రామాల రైతుల స్థితిగతులను అధ్యయనం చేసే కరపత్రాన్ని సిద్ధం చేశారని అన్నారు. వ్యవసాయ సంబంధాలపై ఆయనకు లోతైన అవగాహన ఉందని అన్నారు. వ్యవసాయ రంగంలో చాలా ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టుల పై ఆయన అనేక నివేదికలు అందిం చారని తెలిపారు. ప్రతి ప్రాంత భౌగో ళిక లక్షణాలను అర్థం చేసుకోవడానికి సుందరయ్య అనేక మ్యాప్‌లను కూడా సేకరించారని అన్నారు. రైతు ఉద్య మం, వ్యవసాయ పరిస్థితులు అర్థం చేసుకోవడం, ప్రభుత్వ విధానాలు వంటి పరిశోధనలకు సహకరించే విధంగా 2014లో ఈ ట్రస్ట్ ను ప్రారంభించామని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పి.సుందరయ్య మెమోరియల్ ట్రస్ట్ డైరెక్టర్ బోర్డు సభ్యులు హన్నన్ మొల్లా, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రైతు ఉద్యమానికి సుందరయ్య దిగ్గజ దిక్సూచి
ప్రస్తుత రైతు ఉద్యమానికి పి.సుందరయ్య దిగ్గజ దిక్సూచి. ఫ్యూడలిజం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మహౌన్నత నాయకుడు.
పశ్చిమ బెంగాల్లో తెభాగ, కేరళలో పున్నప్రావాయిలర్, నార్త్ మలబార్ ఉద్యమం, మహారాష్ట్రలో వర్లీ ఆదీవాసీ పోరాటం, త్రిపుర గణ ముక్తి పరిషత్ పోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ ఉద్యమం జరిగాయి.. ఈ పోరాటాలకు క్లైమాక్స్ గా తెలంగాణ సాయుధ పోరాటం నిలిచింది. స్వాతంత్య్ర భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై ఆయన రచనలే గొప్ప వారసత్వం. అందరూ వాటిని అధ్యయనం చేయాలి.
నయా ఉదారవాద విధానాల అమలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రచనలు చదవాల్సిన అవసరమున్నది.
– ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే