నిర్మాణాత్మక చర్యలు లేవు

– మణిపూర్‌లో పరిస్థితి చాలా దుర్భరం
– వివాదాల పరిష్కారానికి సంప్రదింపులు ప్రారంభించాలి
– మూడున్నర నెలలు కావస్తున్నా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు :మీడియాతో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసను అరికట్టేందుకు నిర్మాణాత్మక చర్యలు లేవని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ప్రణాళిక చేయలేదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. నలుగురు సభ్యులతో కూడిన సీపీఐ(ఎం) బృందం మూడు రోజుల మణిపూర్‌ పర్యటన ఆదివారం ముగిసింది. ఈ బృందానికి నేతృత్వం వహించిన సీతారాం ఏచూరి సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్‌)లో మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉందన్నారు. హింస కొనసాగుతున్నదని, అయితే ఈ విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడంలేదని విమర్శించారు. తాము అక్కడ ఉన్నప్పుడే మరో దాడి జరిగిందనీ, మరో ముగ్గురు వ్యక్తులు చనిపోయారని తెలిపారు. సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు.
రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలను ప్రారంభించాలనీ, చర్చలొక్కటే మణిపూర్‌ సమస్యకు పరిష్కార మార్గమని స్పష్టంచేశారు. సంప్రదింపుల ప్రక్రియ నిర్వహించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. అలాగే అన్ని వర్గాల ప్రజల ప్రతినిధులతోనూ చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే ఒక అవగాహనకు రావచ్చని తెలిపారు. అక్కడి ఘటనలు అమానవీయంగా ఉన్నాయని, కొన్నింటిని చూడలేని పరిస్థితి అని చెప్పారు. మణిపూర్‌ గవర్నర్‌తో భేటీ అయ్యామనీ, అలాగే పది లౌకిక ప్రతిపక్ష పార్టీల నేతలను కలిశామని తెలిపారు. వారితో చర్చించామని పేర్కొన్నారు. వివిధ వర్గాల పౌర సమాజ ఉద్యమ నేతలను కలిశామని, రెండు వర్గాల బాధితులండే సహాయక శిబిరాలను సందర్శించామని తెలిపారు. మణిపూర్‌ పర్యటనపై రిపోర్టు తయారు చేసి, భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.

Spread the love