– బీరేన్ సర్కార్ బాధ్యత వహించాలి
– రాష్ట్రంలో రోజు రోజుకూ క్షీణిస్తున్న పరిస్థితి
– సాధారణ స్థితిని పునరుద్ధరించాలి
– బాధితుల గోస వర్ణానాతీతం
– సహాయక శిబిరాల్లో ‘దయనీయమైన’ పరిస్థితి
– తెగల మధ్య ఘర్షణలకు తెర దించాలి.. లేకుంటే దేశ భద్రతకు సమస్యలు : మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకీకి ఇండియా కూటమి ఎంపీల వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్‌లో మే 3న హింస ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు మూడు నెలల పాటు పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని నిస్సందేహంగా నిర్ధారణకు వచ్చామని ప్రతిపక్ష ఎంపీలతో కూడిన ఇండియా కూటమి బృందం స్పష్టం చేసింది. మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అనిశ్చిత, భయం నెలకొన్నాయని, ఈ తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి బలమైన చర్యలు తీసుకోలేదని విమర్శించింది. రెండు రోజుల పాటు మణిపూర్‌లో పర్యటించి, ఘర్షణల బాధితులను కలుసుకొని, తెలుసుకొన్న విషయాలను ఆదివారం ఇంఫాల్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్ అనుసూయా ఉకీని కలిసి 21 మంది ఎంపీల బృందం నివేదించింది. ఈ సందర్భంగా సంయుక్తంగా మూడు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్‌లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఘర్షణలకు సత్వరమే తెర దించకపోతే, దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. శని, ఆదివారాల్లో తాము రాష్ట్రంలో పర్యటించామని, తాము అనేక అంశాల గురించి తెలుసుకున్నామని అన్నారు. ఈ వివరాలను తాము గవర్నర్ వద్ద ప్రస్తావించామని తెలిపారు. గవర్నర్ స్పందిస్తూ, రాష్ట్రంలోని పరిస్థితులపై తన బాధను, ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. తాము చెప్పిన మాటలతో గవర్నర్ ఏకీభవించారని తెలిపారు. అన్ని తెగల వారితోనూ సమావేశాలను ఏర్పాటు చేసి, సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని ఆమె చెప్పారన్నారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపించాలని సలహా ఇచ్చారని చెప్పారు. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పారదోలడానికి, సమస్యను పరిష్కరించడానికి అన్ని తెగల ప్రతినిధులతోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారన్నారు. ఈ సలహాకు తాము కూడా అంగీకారం తెలిపామని చెప్పారు. మణిపూర్ పర్యటనలో తాము తెలుసుకున్న అంశాలను పార్లమెంటులో కూడా చెప్పేందుకు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల జరిగిన లోపాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబడతామన్నారు. లోయలో నివసిస్తున్న మెయితీలు రాష్ట్రంలోని కుకీలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతున్నారని, అదేవిధంగా కుకీలు లోయ ప్రాంతంలోకి రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ సరుకులు, పశువుల దాణా, పాలు, చిన్న పిల్లల ఆహారం వంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. ఈ సమస్యలన్నిటినీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించాలని గవర్నర్ చెప్పారన్నారు.
పూర్తిగా స్తంభించిన డబుల్ ఇంజిన్ సర్కార్… సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం
మణిపూర్‌లో అన్నివ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ పూర్తిగా స్తంభించిందని, విఫలం అయిందని సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం అన్నారు. తాము కుకీ, మెయితీ సహాయ శిబిరాలు సందర్శించామని, దురదష్టవశాత్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహాయ శిబిరాలకు ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని విమర్శించారు. ఆహారం, మెడిసన్ వంటి నిత్యావసరాలు సహాయ శిబిరాల్లోని బాధితులకు అందటం లేదని అన్నారు. చాలా మంది మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయని, చాలా మందిని నరికి చంపుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ వందేభారత్ రైళ్లకు జెండా ఊపడానికి దేశమంతా తిరుగుతున్నారని, కానీ మణిపూర్‌కు ఎందుకు వెళ్లరని, అక్కడి ప్రజల బాధలను ఎందుకు వినరని ప్రశ్నించారు. ఎందుకంటే అక్కడ విద్వేష రాజకీయాలకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలే కారణమని విమర్శించారు. అక్కడ శాంతి పునరుద్ధరణకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని అన్నారు. తాము ప్రజలతో మాట్లాడామని, ఆ అంశాలు పార్లమెంట్‌లో లేవనెత్తుతామని పేర్కొన్నారు. ఆర్‌ఎస్పీ ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ మాట్లాడుతూ మణిపూర్‌పై కేంద్రం జోక్యం చేసుకోకపోతే మరింత దిగజారుతాదని అన్నారు. అన్ని వర్గాల మధ్య శాంతిని పునరుద్ధరించాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ సుస్మిత దేవ్ మాట్లాడుతూ మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌పై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని, సామాన్య ప్రజలు ఇకపై మణిపూర్ సీఎంకు మద్దతు ఇవ్వటం లేదని అన్నారు. తాను జులై 19న మణిపూర్‌లో పర్యటించానని, మళ్లీ ఇప్పుడు పర్యటించానని, కానీ అక్కడ ఏమాత్రం పరిస్థితుల్లో మార్పు లేదని పేర్కొన్నారు. సూర్య అస్తమయం కాగానే లోయ, కొండ ప్రాంతాల సరిహద్దుల్లో రెండు వైపుల కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు. సహాయ శిబిరాల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని, ప్రజలు అభద్రతలోఉన్నట్లు భావిస్తున్నారని తెలిపారు. ఆయా గ్రూపుల వద్దనున్న ఆయుధాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని పేర్కొన్నారు. ఎవరైనా సహాయ శిబిరాల నుంచి ఇండ్లకు వెళ్తే.. ప్రజలపై ఆ ఆయుధాలనే ఉపయోగిస్తున్నారని తెలిపారు.
60 వేల మంది నిరాశ్రయులు
”మణిపూర్‌లో హింస కారణంగా ప్రభావితమైన వ్యక్తుల ఆందోళనలు, అనిశ్చితులు, బాధలను విని చాలా షాక్‌కు గురయ్యాం. విచారంగా ఉంది. అన్ని వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి రెండు వైపులా కోపం, పరాయీకరణ భావం ఉంది. వారికి న్యాయం, శాంతి కావాలి. వీటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించాలి” ప్రతినిధి బృందం వినతిపత్రంలో పేర్కొంది. ”రెండు వర్గాల ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో విఫలమైనందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలి. గత మూడు నెలల్లో 60,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 140 మందికి పైగా మరణించారు. 500 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఐదు వేలకు పైగా ఇళ్లు దగ్ధం అయ్యాయి” అని పేర్కొంది. ”గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా కాల్పులు, ఇండ్ల దహనాలు జరుగుతున్నాయి” అని తెలిపింది. సహాయక శిబిరాల ”దయనీయమైన” పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేయబడినందున విద్యార్థులు అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతా ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలి” అని కోరింది. ”గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ నిషేధం నిరాధారమైన పుకార్లకు సహాయం చేస్తోంది. ఇది ఇప్పటికే ఉన్న అపనమ్మకాన్ని పెంచుతోంది” అని పేర్కొంది. ”గత 89 రోజులుగా మణిపూర్‌లో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్‌గా మీరు తెలియజేయాలి. మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ప్రధానమంత్రి మౌనం ఆయన ఉదాసీనతను తెలియజేస్తోంది” అని విమర్శించింది. ”శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడానికి, ”పునరావాసం, పరిహారం” అత్యవసర ప్రాతిపదికన ప్రారంభించడం చాలా అవసరం” అని వినతిపత్రంలో స్పష్టం చేసింది. మణిపూర్ పర్యటనలోఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోరు, కె.సురేష్, ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్), సుస్మిత దేవ్ (టీఎంసీ), మహువా మాఝీ (జేఎంఎం), కనిమొళి (డీఎంకే), సంతోష్ కుమార్ (సీపీఐ), మహమ్మద్ ఫైజల్ (ఎన్సీపీ), రాజీవ్ రంజన్ లలన్ సింగ్, అనిల్ ప్రసాద్ హెగ్డే (జేడీయూ), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), చౌదరి జయంత్ సింగ్ (ఆర్‌ఎల్డీ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), అరవింద్ సావంత్ (శివసేన-యూబీటీ) ఎన్‌కె ప్రేమ చంద్రన్ (ఆర్‌ఎస్పీ), టి. తిరుమవలవన్, డి. రవి కుమార్ (వీసీకే), ఈటి మహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), సుశీల్ గుప్తా (ఆప్) తదితరులు ఉన్నారు.