శాకాహారులే ఇక్కడ కూర్చోవాలి

Only vegetarians should sit here

– ఐఐటీ బాంబేలో వివక్ష
ముంబయి : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయిలో మాంసాహారులపై వివక్ష వెలుగుచూసింది. క్యాంటీన్‌లో ”శాకాహారులు మాత్రమే ఇక్కడ కూర్చోవాలి” అని రాసి వున్న పోస్టర్లను కొందరు విద్యార్థులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. హాస్టల్‌ క్యాంటీన్‌లో మాంసాహారం తిన్నందుకు ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానించాడని, గత వారం హాస్టల్‌ 12లో ఈ ఘటన జరిగినట్టు కొందరు విద్యార్థులు తెలిపారు. మాంసాహారం తింటున్నామంటూ తమపై వివక్ష చూపుతున్నారని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంటీన్‌ గోడలపై పోస్టర్లు వెలిశాయని, మాంసాహారులెవరైనా అక్కడ కూర్చుంటే వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెజ్‌, నాన్‌వెజ్‌పై నిబంధనలు ఏవైనా ఉన్నాయా? అనే విషయంపై మూడు నెలల క్రితం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రశ్న అడిగామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు తీసుకునే ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదనే సమాధానం వచ్చినట్టు వివరించారు. అయినప్పటికీ నాన్‌ వెజిటేరియన్స్‌ను అక్కడ కూర్చోనివ్వడం లేదని ఓ విద్యార్థి తెలిపాడు. . ఇది తమకు అవమానకరంగా ఉందని కొందరు విద్యార్థులు ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు. ఈ వివాదంపై ఐఐటి యాజమాన్యం స్పందించలేదు. హాస్టల్‌ వద్ద పోస్టర్లు ఎవరు అంటించారనే విషయం తమకు తెలియదని, వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్స్‌ అంటూ విభజించి సీట్లు కేటాయించే పద్ధతి లేదని ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. 2018లోనూ మాంసాహారం తీసుకునే విద్యార్థులు విడిగా ప్లేట్లు వాడాలంటూ జారీ అయిన ఓ సర్క్యులర్‌పై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love