బీజేపీని గద్దెదించాలి

– విభేదాలను పక్కన పెట్టి పని చేద్దాం :పాట్నాలో ప్రతిపక్షాల సమావేశంలో నేతలు
జులైలో సిమ్లాలో తదుపరి సమావేశం
– ఉమ్మడి ఎజెండాను ఖరారు చేస్తాం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
భారత లౌకిక ప్రజాస్వామ్య పునాదికి, సమగ్రతకు పెను ముప్పుగా పరిణమిస్తున్న సంఫ్‌ు పరివార్‌ శక్తులను, బీజేపీని అధికారం నుంచి గద్దె దించడమే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో ఐక్యంగా ఉద్యమించాలని ప్రతిపక్ష పార్టీ నేతల సమావేశంలో అంగీకారం కుదిరింది. జాతీయ ప్రయోజనాల కోసం 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఐక్యంగా పోరాడాలని, విభేదాలను పక్కనపెట్టి వెసులుబాటుతో పనిచేయాలని ప్రతిపక్ష నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఇందుకు గాను
బీజేపీని గద్దెదించాలి శుక్రవారం బీహార్‌ రాజధాని పాట్నాలో 17 రాజకీయ పార్టీలు సమా వేశం అయ్యాయి. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశానికి బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. ప్రతిపక్ష పార్టీలు మరింత సమన్వయంతో ముందుకు సాగడానికి భవిష్యత్‌ కార్యక్రమాలను రూపొందించడానికి,తగిన రాజకీయ వ్యూహం కోసం.. జులై రెండో వారం లో హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
సిద్ధాంతాల మధ్య పోరు ఇది : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ
ఇది సిద్ధాంతాల మధ్య పోరు.. ”మాకు కొన్ని విభేదాలు ఉండవచ్చు, అయితే ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మా భావజాలాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం” . నిజానికి, తమలో విభేదాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. సిద్ధాంతాలపై పరస్పరం చర్చించుకుని వాటిని పరిరక్షించుకునేందుకు కృషి చేస్తాం.. దేశ పునాదులపై బీజేపీ దాడి చేస్తోంది. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడితేనే దేశాన్ని రక్షించుకోవచ్చు. దేశం కోసం త్యాగాలు చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఢిల్లీ ఆర్డినెన్స్‌ వివాదంపై ఆప్‌తో విభేదాలు లేకుండా చూసేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది.
యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రజల ఆశీర్వాదం :ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌
”ఇక్కడ (పాట్నా) ప్రారంభమైన జయప్రకాశ్‌ నారాయణ్‌ ( జేప) ఉద్యమం మాదిరిగానే, మా ఐక్య ఫ్రంట్‌కు ప్రజల ఆశీస్సులు లభిస్తాయి” .
కలిసే ఉన్నాం..కలిసికట్టుగా పోటీ చేస్తాం: మమతా బెనర్జీ
ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని, కలిసికట్టుగానే ఎన్నికల్లో పోరా డతాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పాట్నా లో ఏదైతే ప్రారంభమైనా ప్రజా ఉద్యమం రూపుదిద్దుకుంటుందని పాట్నాలో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. ”మీమంతా ఐక్యంగా ఉన్నాం. బిజెపికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతాం” అని అన్నారు. ”బీజేపీ చరిత్ర ను మార్చాలని కోరుకుంటుంది. మేము చరిత్రను రక్షించేలా చూస్తాం ” అని అన్నారు. తాము ప్రతిపక్ష పార్టీలమేనని, దేశభక్తి ఉన్న దేశ పౌరులమని, ‘భారత్‌ మాతను’ ప్రేమించే వారిమని ఆమె నొక్కి చెప్పారు. ఫాసిస్ట్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించడమే తమ లక్ష్యమని చెప్పారు.
జమ్మూకాశ్మీర్‌కు చేరని ప్రజాస్వామ్యం: ఒమర్‌ అబ్దుల్లా
అతలాకుతలమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, తిరిగి ప్రజాస్వామ్యాన్ని పాదుకొలిపేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ పాట్నాలో సమావేశమైనట్టు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. ప్రజాస్వామ్యం హత్యకు గురైన దేశంలోనే తాను, మెహబూబూ ముఫ్తీ ఉన్నామని అన్నారు.
ప్రజాస్వామ్యంపై అమెరికాలో గురువారంనాడు చర్చ లు జరిగాయని, జమ్మూకశ్మీర్‌కు ప్రజాస్వామ్యం ఎందుకు చేరువకాలేదని ఒమర్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంపై దాడి జరగడం జమ్ము కాశ్మీర్‌లో ప్రారంభమైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోందని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ విమర్శించారు. మన రాజ్యాంగం, లౌకికవాదం, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్న తీరు జమ్మూ కాశ్మీర్‌లో మొదలైంద న్నారు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా జరుగుతోందని పేర్కొన్నారు.
దేశ సమగ్రతను కాపాడేందుకు మేము కలిసి వచ్చాం: ఉద్ధవ్‌ థాకరే
మాకు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయని, కానీ దేశ వైవిధ్యం, సమగ్రతను కాపాడటానికి తాము కలిసి వచ్చామని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాకరే అన్నారు.
ఈ సమావేశంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌, మజోన్‌ కుమార్‌ ఝా (ఆర్‌జేడీ ), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌, టిఆర్‌ బాలు (డీఎంకే), జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం), ఢిల్లీ, పంజాబ్‌ సిఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, రాజ్యసభ ఎంపీలు సంజరు సింగ్‌, రాఘవ్‌ చద్దా (ఆప్‌), ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), కెసి వేణుగోపాల్‌ (కాంగ్రెస్‌), సుప్రియా సులే, ప్రఫుల్‌ పటేల్‌ (ఎన్‌సీపీ), ఆదిత్య ఠాక్రే, సంజరు రౌత్‌ (శివసేన ఉద్దవ్‌ ఠాక్రే), అభిషేక్‌ బెనర్జీ, డెరెక్‌ ఓబ్రెయిన్‌, ఫిర్హాద్‌ హకీమ్‌ (టీఎంసీ), లలన్‌ సింగ్‌ (జేడీయూ), దీపాంకర్‌ భట్టాచార్య (సీపీఐ(ఎంఎల్‌)) పాల్గొన్నారు.
కలిసి పనిచేద్దాం…బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌
”సమావేశం ఫలప్రదమైంది. ఈ సమావేశంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 17 పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించాం. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి ఐక్యంగా పోటీ చేయడానికి ఏకాభిప్రాయం కుదిరింది. కేంద్రంలోని ప్రస్తుత పాలనపై ఐక్యంగా పోరాడేందుకు ఉమ్మడి కూటమి ఏర్పాటుకు నేతలంతా కలిసి పనిచేద్దాం…: నితీశ్‌ అంగీకరించారు” . తాము జాతీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని, దేశ చరిత్రను మార్చడానికి, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోంది.
లౌకిక ప్రజాస్వామ్య నిర్మాణమే లక్ష్యం
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
దేశాన్ని ఫాసిస్ట్‌ హిందుత్వ దేశంగా మార్చేందుకు సంఫ్‌ు పరివార్‌ ప్రయత్నిస్తోంది. భారత లౌకిక ప్రజాస్వామ్య నిర్మాణాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా సాగుతోంది. దీనిని ఐక్యంగా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైంది.. సమాఖ్య సూత్రాలు, లౌకికవాదం, ప్రజాస్వామ్యం వంటి రాజ్యాంగ స్తంభాలన్నీ నిరంతరం దాడికి గురవుతున్నాయి. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మన చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఫ్‌ు పరివార్‌పై సమిష్టిగా వ్యతిరేకత రావాలి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అంతర్గత భద్రతా ఉల్లంఘనల వంటి ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనను నిర్వహించనున్నాయి.. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు రాష్ట్రాల్లో చర్చలు జరగనున్నాయి.
బీజేపీపై సంఘటిత పోరు;సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
బీజేపీపై సంఘటిత పోరాటానికి అంగీకారం కుదిరింది. తొమ్మిదేండ్ల బీజేపీ పాలన దారుణంగా ఉంది. దేశ ప్రజాస్వామ్య, లౌకిక నిర్మాణం దాడికి గురైంది. మత-కార్పొరేట్‌ కూటమికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం సిగ్గులేకుండా కార్పొరేట్‌ అనుకూల విధానాలను అమలు చేస్తోంది. సమాఖ్య వ్యవస్థను కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. సమిష్టి పోరాటంతోనే బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టగలం.
సిమ్లాలో ఎజెండా రూపొందిస్తాం:కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే
భవిష్యత్తు ఎజెండా సిద్ధం చేసేందుకు జులైలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశం నిర్వహించను న్నాం. ఉమ్మడి ఎజెండాను సిద్ధం చేయాలనుకుంటున్నాం. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వచ్చే సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తాం. 2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో కలిసికట్టుగా ఏవిధంగా పోరాడాలనే విషయంపై ఒక ఎజెండాను ఖరారు చేస్తాం.

Spread the love