నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారంనాడు విచారణ జరిగింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై స్పందించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED)ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ”వ్యక్తి స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం” అని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది ముందు ఎందుకు తన క్లయింట్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని కేజ్రీవాల్ తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వి తన వాదనల సందర్భంగా ప్రశ్నించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, ”స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైన అంశం” అని స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్టుపై కేజ్రీవాల్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఈడీ తరఫు న్యాయవాదిని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం లోగా స్పందన తెలియజేయాలని ఈడీకి గడువు విధించారు.