నా భర్తను జైల్లో చంపాలని చూస్తున్నారు: సునీత కేజ్రీవాల్‌

నవతెలంగాణ – ఢిల్లీ : తీహాడ్‌ జైల్లో ఉన్న తన భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ను చంపాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని సునీత కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆయనకు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. విపక్ష కూటమి ‘ఇండియా’ ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్షాల కూటమి పోరాడుతోందన్నారు. ‘నా భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపాలని అనుకుంటున్నారు. ఆయనకిచ్చే ఆహారాన్ని పర్యవేక్షించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన.. 12ఏళ్లుగా ఇన్సులిన్‌ తీసుకుంటున్నారు. కానీ, ఆయనకు మాత్రం జైల్లో ఇన్సులిన్ ఇవ్వడం లేదు. ఆయనకు రోజు 50 యూనిట్ల ఇన్సులిన్‌ అవసరం’ అని సునీత కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌లను ఈడీ అరెస్టు చేయడంపై మండిపడ్డ ఆమె.. నేరం రుజువు కాకుండానే వాళ్లను జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Spread the love