14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భవిచ్చిత్తికి సుప్రీం అనుమతి..

నవతెలంగాణ – ఢిల్లీ: లైంగికదాడికి గురై గర్భం దాల్చిన మైనర్‌ బాలిక అబార్షన్‌కు సుప్రీంకోర్టు అనుమతించింది. వైద్య పరంగా వైద్యపరంగా 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అంగీకరించింది. దీనిని ‘అసాధారణ’ కేసుగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం.. విస్తృత అధికారాలను ఉపయోగించుకుని అబార్షన్‌ను అనుమతి మంజూరు చేసింది. భారతీయ చట్టాల ప్రకారం గర్బం దాల్చిన తర్వాత 24 వారాలు దాటితే.. అబార్షన్‌కు కోర్టు అనుమతి తప్పనిసరి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ దశలో అబార్షన్ చేయించుకోవడం వల్ల కొంత ప్రమాదం ఉంటుంది.. కానీ, ప్రసవం కంటే ఆమె ప్రాణాలకు ముప్పు ఎక్కువ కాదని అభిప్రాయపడింది. ఆమెకు 14 ఏళ్లు, ఇది అత్యాచారం కేసు.. ఇది అసాధారణమైన కేసు కాబట్టి మేము మెడికల్ టెర్మినేషన్‌కు అనుమతిస్తాం’ అని సీజేఐ అన్నారు.  కేసు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన మైనర్ బాలిక లైంగికదాడికి గురికాగా.. ఆమె గర్బం దాల్చింది. కానీ, ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితురాలి తల్లి.. అబార్షన్ కోసం అనుమతి కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతించాలని అభ్యర్ధించారు. అయితే, ఈ అభ్యర్థనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఆరు నెలల దాటిపోయిందని, ఇప్పుడు అబార్షన్ చేస్తే పిండస్థ శిశువు జన్మించే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.
దీంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టుకు గడపతొక్కింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం.. ముంబయిలోని సియాన్‌ ఆస్పత్రి మెడికల్‌ బోర్డును నివేదిక కోరింది. ఈ దశలో అబార్షన్ వల్ల బాలిక శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలతో నివేదిక సమర్పించిన మెడికల్‌ బోర్డు..‘‘ఈ సమయంలో అబార్షన్ వల్ల కొంత ప్రమాదం ఉన్నప్పటికీ.. ప్రసవం తర్వాత ఎదురయ్యే ముప్పుతో పోలిస్తే అదేమంత ఎక్కువ కాదు. ఈ గర్భాన్ని కొనసాగించడం వల్ల బాలికపై శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది’ స్పష్టం చేసింది. ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బాలిక 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి పూర్తి న్యాయం అందించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తమకున్న విస్తృత అధికారాలను ఉపయోగించినట్టు తెలిపింది. ఆ బాలికకు తక్షణమే వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేయాలని సియాన్‌ ఆసుపత్రి డీన్‌ ఆదేశించింది.

Spread the love