ఐటి నోటీసులపై కాంగ్రెస్‌కు ఊరట

నవతెలంగాణ – న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు రూ.3,500 కోట్లకు పైగా పన్ను బకాయిలపై కాంగ్రెస్‌ పార్టీకి ఊరట లభించింది. పన్ను రికవరీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏ పార్టీని ఇబ్బందులకు గురిచేయాలనుకోవట్లేదని వెల్లడించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై 24కు వాయిదా వేసింది. ఐటి నోటీసులపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు జస్టిస్‌ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టబోదని ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా కోర్టుకు తెలిపారు. కాంగ్రెస్‌ ఖాతాల నుండి రూ.135 కోట్లు రికవరీ చేసుకోవడంతో పాటు ఈ ఏడాది 20శాతం చెల్లించాల్సిందిగా అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అయితే తర్వాత రూ.1700 కోట్లకు నోటీసులు అందాయని, దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామని, అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని తుషార్‌ మెహతా తెలిపారు. ఆస్తులను జప్తు చేయడం ద్వారా రూ. 135 కోట్లు వసూలు చేసిందని కాంగ్రెస్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. తమది లాభార్జన సంస్థ కాదని, కేవలం రాజకీయ పార్టీ మాత్రమేనని అన్నారు. అయితే ఈ అంశంపై వివరణనివ్వాల్సి వుందని తుషార్‌ మెహతా తెలిపారు. కాగా, ఐటి నోటీసులు కేంద్ర ప్రభుత్వ ‘టాక్స్‌ టెర్రరిజమ్‌’ అని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ఈ చర్య ఎన్నికల ముందు తమ పార్టీని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసే యత్నమని పేర్కొంది. ఎన్నికలకు విఘాతం కలిగించే చర్యఅని, ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలని పిటిషన్‌లో కోరింది.

Spread the love