ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నవతెలంగాణ – హైదరాబాద్: న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో ఎటువంటి మార్పు ఉండ‌బోదు అని సుప్రీంకోర్టు ఇవాళ త‌న తీర్పులో స్ప‌ష్టం చేసింది. లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. ఈవీఎంల‌లో ఓట్ల‌తో పాటు వీవీప్యాట్ల స్లిప్‌లను కూడా లెక్కించాల‌ని సుప్రీంకోర్టులో ప‌లు పిటీష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఆ పిటీష‌న్ల‌ను విచారించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. ఆ అభ్య‌ర్థ‌ల‌ను తోసిపుచ్చింది. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్ల‌తో వీవీప్యాట్ల స్లిప్ల‌ను వంద శాతం స‌రిచూసుకోవాల‌ని చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల‌తో వంద శాతం క్రాస్ వెరిఫికేష‌న్ కుద‌ర‌ద‌ని కోర్టు చెప్పింది. ఈవీఎంల స్థానంలో మ‌ళ్లీ పేప‌ర్ బ్యాలెట్ల‌ను వాడాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను కూడా జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్త‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది. వీవీప్యాట్ల ఫిజిక‌ల్ డిపాజిట్ కూడా కుద‌ర‌దు అని కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్‌ను సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపర్చాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది. అప్పుడు ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్‌కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే… ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం.. అనవసర అనుమానాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక, కౌంటింగ్‌ సమయంలో పేపర్‌ స్లిప్‌లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్‌ మెషిన్‌ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్‌ ఖన్నా ఈసీకి తెలిపారు. అంతేగాక, ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్‌కోడ్‌ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.

Spread the love