బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తుంది : రాహుల్‌గాంధీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ : బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే.. రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లోని భింద్‌ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ప్రతిని చూపుతూ .. పేదలు, దళితులు, ఎస్‌టి, బిసిలకు హక్కులు కల్పించిన ఈ రాజ్యాంగాన్ని.. కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ముక్కలుగా చేసి, విసిరికొడుతుందని అన్నారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని అన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు, బిసిలకు రాజ్యాంగం మహాత్మాగాంధీ ఉపాధి పథకం, భూ హక్కులు, రిజర్వేషన్లు సహా పలు హక్కులను కల్పించిందని అన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, వారి ఎంపిలు తాము తిరిగి ఎన్నికైతే.. ఈ (రాజ్యాంగ ప్రతిని) పుస్తకాన్ని విసిరికొట్టాలనే నిర్నయానికి వచ్చారని అన్నారు. కేవలం 20-25 బిలియన్లు దేశాన్ని నడపాలని బీజేపీ కోరుకుంటోందని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం కానపుడు .. ప్రభుత్వ సంస్థలను, రైల్వేలు, ఇతర సంస్థలను ఎందుకు ప్రైవేట్‌ పరం చేస్తోందని ధ్వజమెత్తారు.
కేంద్రంలో కాంగ్రెస్‌ అదికారంలోకి వస్తే.. మహాలక్ష్మి యోజన పథకం ద్వారా కోట్లాది మంది మహిళలను లక్షాధికారులను చేస్తుందని అన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం (నెలకు రూ. 8,500) చొప్పున మహిళల ఖాతాల్లోకి లక్ష రూపాయలను జమ చేస్తుందని అన్నారు. ప్రధాని మోడీ కేవలం 22నుండి 25 మంది పారిశ్రామిక వేత్తలను బిలియనీర్లుగా మారిస్తే .. కాంగ్రెస్‌ కోట్లాది మంది మహిళలను లక్షాధికారులను చేస్తుందని అన్నారు. భింద్‌ లోక్‌సభ (ఎస్‌సి-రిజర్వ్‌డ్‌) స్థానం నుండి బిజెపి సిట్టింగ్‌ ఎంపి సంధ్యా రారుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పూల్‌ సింగ్‌ బరయ్యను పోటీకి దింపింది.

Spread the love