బీజేపీకి షాక్‌ ఇచ్చిన ‘ఇండియా’

నవతెలంగాణ న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్‌ ఇచ్చింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఏడు స్థానాలకుగాను నాలుగు స్థానాల్లో ‘ఇండియా` కూటమి విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. కాగా, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు తఫజ్జల్ హొస్సేన్, బిందు దేబ్‌నాథ్ 30,237, 18,871 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పార్వతి దాస్, కాంగ్రెస్‌ అభ్యర్థి బసంత్ కుమార్‌పై 2,400 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ మరణంతో ఖాళీ అయిన పుతుపల్లి స్థానం నుంచి కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి చాందీ ఊమెన్‌ గెలిచారు.
కాగా, ‘ఇండియా’ కూటమికి చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థిని బేబీ దేవి, డుమ్రీ ఉపఎన్నికల్లో గెలిచారు. ప్రత్యర్థి పార్టీ ఏజేఎస్‌యూకు చెందిన యశోదా దేవిపై 17,000కుపైగా మెజార్టీతో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ధూప్‌గురి స్థానాన్ని బీజేపీ నుంచి చేజిక్కుకున్నది. బీజేపీ అభ్యర్థి తాపసి రాయ్‌పై టీఎంసీ అభ్యర్థి నిర్మల్‌ చంద్రా రాయ్‌ 4,300 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ స్థానంలో అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాక‌ర్ సింగ్‌, బీజేపీ అభ్యర్ధి దారా సింగ్ చౌహాన్‌పై 42,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Spread the love