ఖాతాలను ఫ్రీజ్ చేసి కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బ‌తీస్తున్నారు: సోనియా గాంధీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఓ వ్య‌వ‌స్థీకృత ప‌ద్ధ‌తిలో మోడీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నార‌ని సోనియా గాంధీ అన్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల అంశం గురించి ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల అంశం కేవ‌లం కాంగ్రెస్ పార్టీపై మాత్ర‌మే ప్ర‌భావం చూప‌డంలేద‌ని, ప్రాథ‌మికంగా అది మన ప్ర‌జాస్వామ్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు మోడీ వ్య‌వ‌స్థీకృత దాడి చేస్తున్నార‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి వ‌సూల్ చేసిన నిధుల్ని ఫ్రీజ్ చేశార‌ని, త‌మ అకౌంట్ల నుంచి డ‌బ్బును లాగేసుకుంటున్నారని ఆరోపించారు. చాలా విప‌త్క‌ర ప‌రిస్థితులు, స‌వాళ్ల మ‌ధ్య త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని ఆమె అన్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్లు రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ద‌న్నారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ‌ల్ల బీజేపీకి చాలా లాభం చేకూరింద‌ని, మ‌రో వైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జ‌రుగుతున్న‌ట్లు సోనియా పేర్కొన్నారు.

Spread the love