నవతెలంగాణ రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో(chhattisgarh) కాంగ్రెస్ పార్టీ(congress) మరోసారి అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) హమీ ఇచ్చారు. కంకేర్ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రోత్సాహక యోజన కింద బీడీ ఆకులు సేకరించే వారికి ఏడాది రూ.4 వేలు ఇస్తామని తెలిపారు. గిరిజనులు అత్యధికంగా నివసించే బస్తర్ ప్రాంతంలో 20నియోజకవర్గాలకు నవంబర్ 7న తొలి దశల ఎన్నికలు జరగనున్నాయి. 17న మలిదశ పోలింగ్ నిర్వహించనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశంలో తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తనను తాను ఓబీసీగా చెప్పుకొనే మోడీజీ మాత్రం.. కులగణనకు భయపడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తల కోసం పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ మాత్రమే రైతులు, దళితులు, కార్మికుల, ఆదివాసీల కోసం పనిచేస్తోందని చెప్పారు. తాను మాట్లాడుతుండగా ఎవరో మూర్చ పోయారని తెలుసుకున్న రాహుల్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేశారు. వేదిక చివరికి నీటి సీసాతో వెళ్లి అతడి పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.