కేంద్రంపై అవిశ్వాసం..!

– నాలుగోరోజూ కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళనలు
– ప్రధాని మోడీని సభకు రప్పించటమే లక్ష్యం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే దిశగా ప్రతిపక్ష పార్టీలు యోచిస్తున్నాయి. ప్రధాని మోడీని పార్లమెంట్‌కు రప్పించి, మణిపూర్‌ గురించి మాట్లాడించేందుకే ఈ ప్రయత్నమని పేర్కొంటు న్నాయి. ఈ అంశంపై గత రెండు రోజులుగా ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చర్చ జరుగుతోంది. మంగళవారం రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్లు సమావేశమై అవిశ్వాస తీర్మాన నోటీసు సమర్పించడంపై తుది నిర్ణయానికి ప్రయత్నిస్తు న్నారు. లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు సంఖ్యా బలం ఉందని తమకు తెలుసునని, అయితే ప్రధాని మోడీ మణిపూర్‌ ఘాతుకాలకు సమాధానం చెప్పాలని పట్టుబడుతున్న ప్రతిపక్షాలు… ఆ మేరకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఈ అవిశ్వాసానికి పూనుకుంటున్నాయని ఆయా వర్గాలు తెలిపాయి. మరింత చర్చలు, సంప్రదింపుల తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఒక సీనియర్‌ నేత అన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న మారణహౌమంపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సాక్షిగా నిలుస్తున్నాయి. సమావేశాల నాలుగో రోజైన మంగళవారం కూడా ఉభయసభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్‌ హింసపై ప్రధాని మోడీ నోరువిప్పాలనే డిమాండ్‌ నుంచి ప్రతిపక్షాలు తగ్గేదేలేదంటున్నాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతూనే..మణిపూర్‌ అంశాన్ని పక్కదారిపట్టించటానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తు న్నాయి. అయితే ఒకే రోజు ఇటు బీజేపీ పార్లమెంటరీ సమావేశం..అటు ప్రతిపక్షాల కూటమి(ఇండియా) భేటీఅయి తమ వ్యూహాలకు పదును పెడుతుండటం గమనార్హం.
వీగిపోతుందని తెలిసినా…?
మణిపూర్‌ అగ్నిగుండంలా మండుతున్నా.. ప్రధాని మోడీ నోరు విప్పకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మణిపూర్‌ సర్కార్‌ బీజేపీదే కావటం,పైగా అక్కడి సీఎం పై ఎలాంటి చర్య తీసుకోకపోవటం,అల్లర్ల నివారణకు కేంద్రం చేసిందేమీ లేకపోవటంతో.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగురోజులు గడిచినా సభలో మాట్లాడటానికి ప్రధాని ఇష్టపడటంలేదు. కేంద్రమంత్రులు రాజ్‌నాధ్‌ సింగ్‌, అమిత్‌షాలను తెరపైకి తెచ్చి మణిపూర్‌పై మాట్లాడించేలా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రతిపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధం కాగానే..కేంద్రహౌంమంత్రి రంగంలోకి దిగి ప్రతిపక్షాలకు లేఖ రాశారు. రండి..మణిపూర్‌పై చర్చిద్దామంటూ కబురుపంపారు. అయినా ప్రతిపక్ష (ఇండియా) కూటమి వెనక్కి తగ్గటంలేదు. పార్లమెంట్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మెజారిటీ ఉన్నా, తమ తీర్మానం వీగిపోతుందని తెలిసినా అవిశ్వాసానికి సిద్ధమవుతోంది. ఎందుకంటే స్పీకర్‌ అవిశ్వాసానికి అనుమతిస్తే..దీనిపై అనివార్యంగా విస్తృతమైన చర్చకు, ఓటింగ్‌కు అవకాశం లభిస్తుంది. ఇదే ప్రతిపక్ష కూటమి వ్యూహంగా కనిపిస్తున్నది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇండియా కూటమిపై మోడీ విసుర్లు
 ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్‌ ముజాహిదీన్‌ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందంటూ వ్యాఖ్య
న్యూఢిల్లీ: పార్లమెంటు లైబ్రరీ భవనంలో ప్రారంభ మైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ప్రతిపక్షాల కూటమిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ముందుగా సమావేశానికి ప్రధాని మోడీ చేరుకోగానే నేతలంతా చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాల ఇండియా కూటమిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన… ప్రతిపక్షాల తీరు మారుతుందా..? అని ప్రశ్నించారు. గతంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్‌ ముజాహిదీన్‌ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందన్నారు. ఆఖరికి పీఎఫ్‌ఐ వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా ఇండియా ఉందన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు. కాగా.. ఈ సమావేశంలో మణిపూర్‌ హింస నేపథ్యంలో ప్రతిపక్షాల ఆందోళన, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ చర్చించింది.
దేశ రక్షణే మా లక్ష్యం
– ప్రధాని విమర్శలను తిప్పి కొట్టిన రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తిప్పికొట్టారు. మణిపూర్‌ గాయాన్ని నయం చేయడానికే తమ ప్రతిపక్ష కూటమి ఉందని అన్నారు. మణిపూర్‌లో భారతదేశ సిద్ధాంతమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని పునర్‌నిర్మిస్తామని స్పష్టం చేశారు. ”ప్రధాని గారూ.. మీరు ఎలా కావాలంటే అలా పిలుచుకోండి. మేము ఇండియా. మణిపూర్‌ గాయాన్ని నయం చేయడానికి, ప్రతి మహిళ, చిన్నారుల కన్నీరు తుడిచేందుకు మా కూటమి ఇండియా ఉంది. ప్రజలందరిలో ప్రేమ, శాంతిని, తిరిగి తీసుకువస్తాం. మణిపూర్‌లో భారతదేశ ఆత్మను పునర్‌నిర్మిస్తాం ” అని ట్వీట్‌ చేశారు.

Spread the love