గడ్కరీకి షాక్‌!

– సన్నిహితుల పదవీకాలం పొడిగించేందుకు మోడీ ‘నో’
– గతంలో పార్టీ అధ్యక్ష పదవికి ఎసరు… పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన
న్యూఢిల్లీ : చాలా కాలం నుంచి ఉప్పు, నిప్పుగా మెలగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బయటప డ్డాయి. గడ్కరీ వ్యవహార శైలిపై అసంతృప్తితో రగిలిపోతున్న మోడీ అదను చూసి ఆయనకు మరోసారి షాక్‌ ఇచ్చారు. గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ అధ్యక్ష పదవి నుండి గడ్కరీని తప్పించేందుకు మోడీ తెర వెనుక మంత్రాంగం నడిపారని ప్రచారం సాగింది. గత సంవత్సరం పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా ఆయనను తప్పించారు. తాజాగా ఆయన సన్నిహితులైన ఇద్దరు అధికారుల పదవీకాలాన్ని పొడిగించేందుకు ‘నో’ చెప్పారు.
ఏం జరిగింది?
నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)లో ఉన్నతాధికారులుగా పని చేస్తున్న మహావీర్‌ సింగ్‌, మనోజ్‌ కుమార్‌ల పదవీకాలాన్ని పొడిగించేందుకు మోడీ నేతృత్వంలోని క్యాబినెట్‌ నియామకాల కమిటీ నిరాకరించింది. దీనివల్ల గడ్కరీకి కలిగే ఇబ్బంది ఏమిటని అంటారా? ఈ ఇద్దరు అధికారులు గడ్కరీకి అత్యంత సన్నిహితులు. దేశంలో రోడ్లు, భవనాలు నిర్మించే అతి పెద్ద సంస్థ ఎన్‌హెచ్‌ఏఐలో వీరు కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థ గడ్కరీ నిర్వహిస్తున్న రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆజమాయిషీ కింద పని చేస్తుంది. ఇరువురు అదóకారుల పదవీకాలాన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని ఎన్‌హెచ్‌ఏఐ కోరింది. మహావీర్‌ సింగ్‌ 2020 జూలైలో ఎన్‌హెచ్‌ఏఐ సాంకేతిక సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం ఈ నెలతో ముగుస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించిన సభ్యుడిగా పనిచేస్తున్న మనోజ్‌ కుమార్‌ పదవీకాలం కూడా త్వరలో ముగుస్తుంది. వీరి పనితీరుపై ప్రధాని కార్యాలయం అసంతృప్తితో ఉన్నదని బయటికి చెబుతున్నప్పటికీ వాస్తవానికి దీని వెనుక వేరే కథ ఉంది.
విభేదాలు ఇప్పటివి కావు
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీ మధ్య విభేదాలు ఇప్పటివి కావు. సందర్భం వచ్చిన ప్రతిసారీ బీజేపీ నాయకత్వంపై గడ్కరీ పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుండి తనను తొలగించినప్పుడు గడ్కరీ మండిపడ్డారు. వాడుకొని వదిలేయడం మంచిది కాదంటూ ఘాటుగా స్పందించారు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, కేంద్రంలో సీనియర్‌ మంత్రి అయిన గడ్కరీని పార్టీలో అత్యున్నత విభాగమైన పార్లమెంటరీ బోర్డు నుండి తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామానికి ముందు… అధికారం కోసమే రాజకీయాలు అంటూ నాగపూర్‌లో ఆయన చేసిన వ్యాఖ్య పార్టీ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. రాజకీయ సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమైందని కూడా ఆయన నర్మగర్భంగా చెప్పారు. ‘రాజకీయాలకు ఎప్పుడు స్వస్తి చెప్పాలా అని బాగా ఆలోచించాను. రాజకీయాల కంటే జీవితంలో చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి’ అని అన్నారు.
అసమ్మతివాదిగా ప్రచారం
లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు వస్తాయని బీజేపీ ఊహించలేదని, అందుకే ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక హామీలు ఇచ్చిందని మరో సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్య సైతం వివాదాస్పదమైంది. బీజేపీలో గడ్కరీ అసమ్మతివాది అంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. బీజేపీలో తనకు తగినంత ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. ఛత్తీస్‌ఘర్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైన సందర్భంగా గడ్కరీ వ్యాఖ్యానిస్తూ ‘విజయాలు లభించినప్పుడు అవి తమ ఘనతే అని చెప్పుకునే నాయకులు, పరాజయాలు ఎదురైనప్పుడు వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఉద్దేశించి చేసినవేనని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల బాసట
మోడీ-షా ద్వయంతో గడ్కరీ సంబంధాలు మొదటి నుండీ అంత సజావుగా సాగడం లేదు. ఆయన పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించినప్పటి నుండే వారితో పొసగడం లేదు. బీజేపీ అధ్యక్ష పదవి నుండి గడ్కరీని తప్పించేందుకు జరిగిన ప్రయత్నాల వెనుక అప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ హస్తమున్నదని వార్తలు కూడా వచ్చాయి. మోడీ, షాలతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలతో ఉన్న సన్నిహితత్వం కారణంగా ఆయన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అదీకాక కేంద్ర మంత్రిగా గడ్కరీ పనితీరు ప్రతిపక్షాలను కూడా మెప్పించింది.

Spread the love