మోడీ తర్వాత ఎవరు ?

బీజేపీని వేధిస్తున్న ప్రశ్న
 ఇప్పటికే మసకబారుతున్న చరిష్మా
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా మసకబారుతోందా ? కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడి చాలా రోజులు గడచినప్పటికీ ఈ ప్రశ్న ఇంకా అనేక మందిని వేధిస్తూనే ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ కర్త, కర్మ, క్రియ…అన్నీ తానై వ్యవహరించారు. తాను లేని బీజేపీని ఊహించడమే కష్టమనే అభిప్రాయం కలిగించారు. బహిరంగసభలు, రోడ్‌షోలు, ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాలు, హోర్డింగులు, కరపత్రాలు, పత్రికలు-టీవీలలో ప్రకటనలు, ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్వీట్లు… ఎక్కడ చూసినా మోడీ…మోడీ…మోడీ. ఆయన తన సర్వశక్తులూ ఒడ్డినా బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. పైగా అది ఇంతకుముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రమే.
ఎన్నికలకు ముందు కర్నాటకలో మోడీ జరిపిన పర్యటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఫిబ్రవరిలో శివమొగ్గలో విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రూ. 21 కోట్లు ఖర్చయింది. అదే రోజు బెలగవిలో పర్యటించినందుకు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ వివరాలు రాష్ట్ర గెజిట్‌లోనివే. అలాగే మార్చిలో ధార్వాడ్‌లో ఐఐటీ ప్రారంభోత్సవానికి రూ. 9.5 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. 2020, 2021 సంవత్సరాలలో కర్నాటకలో కోవిడ్‌ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శించింది. అప్పుడే వరదలు వచ్చి పడ్డాయి. అయినప్పటికీ ఆ రెండేండ్ల కాలంలో మోడీ కర్నాటకలో పర్యటించింది కేవలం ఒకే ఒక్కసారి. కానీ ఈ సంవత్సరంలో నాలుగు నెలల వ్యవధిలోనే 11 సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్‌ 29-మే 7 మధ్య 16 బహిరంగసభలలో ప్రసంగించారు. అయితే ఆయన పర్యటించిన ప్రాంతాల్లో కూడా కేవలం రెండు చోట్లనే ప్రాంతాలలోనే బీజేపీ విజయం సాధించగలిగింది. ఈ నేపథ్యంలో మోడీ తర్వాత బీజేపీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎంతో ప్రజాదరణ కలిగిన వాడిగా చెప్పుకుంటున్న మోడీ తన శక్తియుక్తులన్నీ వినియోగించినా పార్టీ గెలుపు గుర్రం ఎక్కలేకపోయిందని, ఇక ఆయన తర్వాత పార్టీని విజయ తీరాలకు చేర్చే నాయకుడెవరని బీజేపీ వర్గాలు మథనపడుతున్నాయి.
మోడీతో పాటు అమిత్‌ షా కూడా కర్నాటకలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ద్వయం 218 నియోజకవర్గాలను చుట్టివచ్చింది. కానీ పార్టీ గెలిచింది 66 సీట్లే. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా పది నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. అయితే ఆయన వల్ల కూడా పార్టీకి ఒరిగిందేమీ లేదు. పైగా కోస్తా కర్నాటకలో బీజేపీ మూడు సిటింగ్‌ స్థానాలు కోల్పోయింది. యోగి ప్రచారం చేసిన ఈ మూడు చోట్లా కాంగ్రెస్‌ గెలిచింది. గాలి జనార్ధనరెడ్డి గెలుపును కూడా యోగి అడ్డుకోలేకపోయారు. వీరందరితో పాటు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, హిమంత బిశ్వశర్మ, దేవేంద్ర ఫడ్నవీస్‌ కూడా పార్టీకి ఓట్లు సంపాదించలేకపోయారు.
ఈ సంవత్సరం నవంబర్‌లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనూ, రాబోయే లోక్‌సభ ఎన్నికలలోనూ మోడీ చరిష్మా పని చేస్తుందా లేదా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఈ ఎన్నికలలో గెలిచినా, ఓడినా మోడీ తర్వాత బీజేపీకి ఎవరు అనే ప్రశ్న మాత్రం అలాగే సమాధానం కోసం వేచి చూస్తూనే ఉంటుంది. మోడీ వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు. ఆయన ఇంకెంత కాలం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేయగలరు? ఎన్ని రాష్ట్రాలలో తిరగగలరు? ఎంతమంది అభ్యర్థులను గెలిపించగలరు?.

Spread the love