ఇవేమి రేటింగ్స్‌ సామీ…!?

– ఎర్రకోట వద్ద మోడీ డాబులు.. వాస్తవ చిత్రం అందుకు భిన్నం
– బీజేపీ పాలనలో పలు సూచికలలో దిగజారిన స్థానాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో అనేక విషయాలను ప్రస్తావించారు. అయితే వీటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించి, వాటిలో వాస్తవమెంత అనే విషయాన్ని విశ్లేషిస్తే…

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ తన తొమ్మిది సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. భారత్‌ను ఆపడం అసాధ్యమని ప్రపంచ నిపుణులు చెబుతున్నారని, ప్రపంచంలోని ఏ రేటింగ్‌ సంస్థ అయినా భారత్‌ను గొప్పగానే చూపుతోందని మోడీ తెలిపారు. అయితే ప్రధాని చెప్పింది నిజమేనా? రేటింగ్‌ సంస్థలు మన దేశాన్ని గొప్పగా చూపుతున్నాయా? అంతర్జాతీయ సూచికలలో భారత్‌ స్థానం అంత అద్భుతంగా ఉన్నదా? అసలు ప్రపంచంలోని వివిధ సూచికలలో భారత్‌ ఏ స్థానంలో ఉందో చూద్దాం…
72022 ప్రపంచ అవినీతి అవగాహన సూచికలో భారత్‌ 85వ స్థానంలో ఉంది. 2014లో కూడా అదే స్థానంలో ఉంది. అంటే గత తొమ్మిది సంవత్సరాలలో ప్రపంచంలోని అవినీతి రేటింగ్‌లో మన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.
72022వ సంవత్సరపు ప్రపంచ సామాజిక పురోగతి సూచికలో భారత్‌ 127వ స్థానంలో (2014లో 114వ స్థానం) ఉండగా, 2020వ సంవత్సరపు సులభతర వాణిజ్య సూచికలో 63వ స్థానంలో (190 దేశాలలో)నూ, 2022వ సంవత్సరపు ప్రపంచ ఆవిష్కరణల సూచికలో 40వ స్థానంలోనూ నిలిచింది.
7ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారం ప్రపంచ మానవాభివృద్ధి సూచికలో మొత్తం 191 దేశాలలో మన స్థానం 132. 2019లో ఈ స్థానం 129గా ఉంది. అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో భారత్‌ మూడు స్థానాలు కోల్పోయింది.
72022వ సంవత్సరపు అంతర్జాతీయ ప్రజాస్వామ్య సూచికలో మన దేశానిది 46వ స్థానం. 2014లో భారత్‌ స్థానం 27. అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించి మనం 19 స్థానాలు దిగజారాము. ఎన్నికల ప్రక్రియలు, ప్రభుత్వ పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కుల పరిస్థితుల ఆధారంగా ఈ సూచికను నిర్ణయిస్తారు.
72023వ సంవత్సరపు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో మొత్తం 181 దేశాలలో భారత్‌ స్థానం 161. 2014లో భారత్‌ 140వ స్థానంలో ఉంది. అంటే మీడియా స్వేచ్ఛకు సంబంధించిన ప్రపంచ రేటింగ్స్‌లో మనం గత తొమ్మిది సంవత్సరాలలో 41 స్థానాలు కిందికి దిగాము.
72022వ సంవత్సరపు ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌ 107వ స్థానంలో ఉంది. 2014లో మన స్థానం 55.
7ఆనందానికి సంబంధించిన ప్రపంచ సూచికలో సైతం మనం బాగా వెనుకబడ్డాము. ఈ సూచికలో మొత్తం 137 దేశాలను పరిగణనలోకి తీసుకోగా మన స్థానం 126. 2015లో భారత్‌ స్థానం 117. అంటే గత ఎనిమిది సంవత్సరాలలో దేశం 20 స్థానాలు దిగజారింది.
ఈ విషయాలను గమనిస్తే ప్రధాని మోడీ చెబుతున్నట్లు ప్రపంచంలోని ప్రతి రేటింగ్‌ మన దేశాన్ని పొగడడం లేదు. వాస్తవానికి చాలా సూచికలలో 2014తో పోలిస్తే… అంటే మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ దిగజారింది. అన్ని రేటింగ్‌ సంస్థలూ మన దేశాన్ని గొప్పగా చూపిస్తున్నాయంటున్న ప్రధాని వాదనలో ఏ మాత్రం వాస్తవం లేదని అర్థమవుతోంది కదా!

Spread the love