గ్రీన్‌ఫీల్డ్‌పై జనాగ్రహం

– ఖమ్మం కలెక్టరేట్‌ను ముట్టడించిన హైవే నిర్వాసితులు … పోలీసుల అడ్డగింత
– బలవంతపు భూసేకరణపై అఖిలపక్ష నేతల ఆగ్రహం
– చట్టవిరుద్ధంగా భూసేకరణ సర్వే : తమ్మినేని
– రాజకీయాలకతీతంగా పోరాటం : కూనంనేని
నవతెలంగాణ-
ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నాగపూర్‌ టూ అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూ సేకరణ సర్వేపై నిర్వాసితులు భగ్గుమంటున్నారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా ఎస్‌ఆర్‌ గార్డెన్‌ వద్ద కలిసిన నిర్వాసితులు అక్కడి నుంచి వైరా రోడ్డు మీదుగా ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నిరసనకారులు కలెక్టరేట్‌ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా అప్పటికే మోహరించిన పోలీసులు రోప్‌లు, బారికేడ్ల సహాయంతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు రెండు గంటలకు పైగా ఆందోళన నిర్వహించారు. అప్పటికే కలెక్టర్‌ బయటకు వెళ్లడంతో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రం ఇచ్చారు. బలవంతపు భూసేకరణపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టవిరుద్ధంగా భూసేకరణ
తమ్మినేని వీరభద్రం,సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా నాగపూర్‌- అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సర్వే సాగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.. అందరినీ సంతోషపరిచే పద్ధతుల్లో తక్కువ నష్టంతో భూసేకరణ ఉండాలని చట్టం చెబుతున్నా.. తగిన పరిహారం ఇవ్వకుండా బలవంతంగా సర్వే చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆరైనా రైతుల గోడు వినాలని విజ్ఞప్తి చేశారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలేవీ రైతుల బాధలు వినడం లేదన్నారు. రైతుల చట్టబద్ధ పోరాటాన్ని ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమక్షంలో జరగాల్సిన సర్వే వారిని నిర్బంధించి చేయడాన్ని ఆక్షేపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో 90% అంగీకరిస్తేనే సర్వే చేయాల్సి ఉండగా.. ముక్తకంఠంతో వ్యతిరేకించినా సర్వే చేయడమేంటని ప్రశ్నించారు. అలైన్‌మెంట్‌ మార్చాలి.. లేదంటే చట్ట ప్రకారం మార్కెట్‌ రేటుకు నాలుగు రెట్లు అదనంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐదేండ్ల కిందట ఖమ్మం కలెక్టరేట్‌ కోసం ఇదే మండలంలో భూసేకరణ చేసినప్పుడు ఎకరానికి రూ.1.05 కోట్లు పరిహారం చెల్లించారని, ప్రస్తుతం ఇక్కడ మార్కెట్‌ రేటు ఎకరానికి రూ.2 కోట్ల వరకు ఉన్న నేపథ్యంలో చట్ట ప్రకారం నాలుగు రెట్లు అదనంగా అంటే.. రూ.8 కోట్లు ఇవ్వాలని కోరారు. ఓ ప్రాజెక్టు ద్వారా ఇటు నిర్వాసితులు.. అటు లబ్దిపొందేవారు.. ఇద్దరూ సంతోషపడేలా ఉండాలన్నారు.
ఐక్య పోరాటాలతో అడ్డుకుందాం..
కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
రాజకీయాలకు అతీతంగా ఐక్యపోరాటాలతో భూసేకరణ సర్వేను అడ్డుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సాక్షాత్తు కేసీఆర్‌ దిగొచ్చినా సరే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్నారు. ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. కోరవి- కోదాడ రూపంలో ప్రత్యామ్నాయ మార్గం ఉన్నా రైతులను నష్టపెట్టడమంటే కార్పొరేట్లు, కాంట్రాక్టర్ల కోసమే అన్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఎవరు ఏమి చెప్పినా వినాల్సిన పనిలేదన్నారు. ఐక్య పోరాటాలతో ఎంతటివారైనా దిగిరాక తప్పదన్నారు.
అధికారంలోకి వస్తే ‘గ్రీన్‌ఫీల్డ్‌’ రద్దు
పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, డీసీసీ అధ్యక్షులు
అవసరం లేని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో భూముల వేలం పెడితే ఎకరం రూ.100 కోట్లు పలికిందని, ఈ హైవే విషయంలో మార్కెట్‌ రేటు ప్రకారం ఎందుకు పరిహారం ఇవ్వరని ప్రశ్నించారు. ఈ ఆందోళనకు రెండు రోజుల ముందు రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరై తమ పోరాటానికి మద్దతు ఇచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు ఏమయ్యారని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్వాసిత జేఏసీ అధ్యక్షులు తక్కెళ్లపాటి భద్రయ్య ప్రశ్నించారు. రఘునాథపాలెం మండలం, కొదుమూరులో నిర్బంధ సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథ, న్యూడెమోక్రసీ, టీడీపీ, బీఆర్‌ఎస్‌తో అఖిలపక్ష కమిటీ ఏర్పాటైంది. అయితే, ఈ ఆందోళనకు బీఆర్‌ఎస్‌ గైర్హాజరుపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్‌, రైతుసంఘం నాయకులు బంతు రాంబాబు, మాదినేని రమేష్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్‌, భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.నవీన్‌రెడ్డి, భూక్యా శ్రీను, తిరుపతిరావు, గోపాలరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, నాయకులు కడపర్తి గోవిందరావు, జానీమియా, పోటు కళావతి, ప్రజాపంథ నుంచి గోకినపల్లి వెంకటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, అశోక్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు జావీద్‌, నాయకులు మారం కరుణాకర్‌రెడ్డి, మిక్కిలినేని నరేంద్ర, సౌజన్య, ముక్కా శేఖర్‌గౌడ్‌, రామచంద్రనాయక్‌, టీడీపీ నాయకులు కొండబాల కరుణాకర్‌, చేతుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి ఈ ఆందోళనకు రామచందర్‌, రాజశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు.

Spread the love