కార్పొరేట్‌ దోపిడీ

– సమిథలు శ్రామికులే
– బతుకు భరోసా కోల్పోతున్న రవాణారంగ కార్మికులు
– ఓలా, ఊబర్‌ ఉచ్చులో యువతరం
మొన్న వాడెవడో కరక్కాయల వ్యాపారం అంటూ కోట్లు కొల్లగొట్టేశాడు. ఈ మధ్యే మరొకడు పత్తితో ఒత్తుల వ్యాపారం అంటూ జనం నెత్తికి నూనె రాసి, కటకటాల్లోకి చేరాడు. మోసపోయేవాడు ఉంటే, మోసం చేసేవాడిది తప్పే కాదనే దుర్నీతి విస్తరిస్తోంది. ‘తప్పు’ అని నిర్థారణ కానంతవరకూ అది సక్రమమే అని వాదించే కార్పొరేట్‌ దోపిడీకి పాలకులూ వత్తాసు పలుకుతున్నారు. ఇప్పుడు రవాణారంగంలో యాప్‌ ఆధారిత బహుళజాతి కంపెనీల హవా ఇలాంటి దోపిడీనే చేస్తోంది. రూపాయి పెట్టుబడి లేకుండా కోట్లు కొల్లగొట్టేస్తున్నారు.
ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
టూ వీలర్‌, కారు, ఆటో, ట్రాలీ, ట్రక్కు ఏదీ వాళ్లది కాదు. అవన్నీ కష్టజీవులు వాయిదాల పద్ధతుల్లో బతుకుతెరువు కోసం అప్పులు చేసి కొనుక్కున్నవే. వీళ్లనే పెట్టుబడిగా చూపించి యాప్‌ ఆధారిత రవాణా సంస్థలు ఆర్థిక, శ్రమ దోపిడీని కొనసాగిస్తున్నాయి. పాకెట్‌ మనీ కోసం ఇంటర్‌, డిగ్రీ చదివే విద్యార్థులు, ఎంతో కొంత ఆర్థిక వెసులుబాటు కోసం కాంట్రాక్ట్‌ అధ్యాపకులు, చిరుద్యోగులు తమ ద్వి చక్ర వాహనాలను ‘ర్యాపిడో’ వంటి యాప్‌ ఆధారిత సంస్థలకు అనుసంధానం చేసుకుంటున్నారు. మరికొందరు నిరుద్యోగ యువకులు, సాంప్రదాయ డ్రైవర్లు తమ వాహనాలను ఊబర్‌, ఓలా వంటి సంస్థలకు అనుసంధానం చేసుకుంటున్నారు. తొలి రోజుల్లో కాస్తో కూస్తో ఆదాయం వచ్చినట్టు కనిపించినా, మూడు నెలలు గడిచాక యాప్‌ బేస్డ్‌ కార్పొరేట్‌ సంస్థల నిజస్వరూపం వెల్లడవుతున్నది. ప్రతి రైడ్‌లోనూ 20 నుంచి 30 శాతాన్ని తమ కమిషన్‌గా మినహాయించుకుంటున్నాయి. ప్రోత్సాహకాల పేరుతో పనిగంటలు, రైడ్‌ల సంఖ్యను టార్గెట్‌గా పెడుతున్నాయి. కమిషన్‌గా మినహాయించుకున్న సొమ్ములోంచే రైడర్ల మధ్య పోటీ పెట్టి, స్వల్ప మొత్తాన్ని ప్రోత్సాహకాల పేరుతో తిరిగి వారికే ఇస్తున్నాయి. యాప్‌ ఆధారిత కార్పొరేట్‌ సంస్థలకు అనుసంధానమైన రైడర్లలో మెజారిటీ డ్రైవర్‌ కమ్‌ ఓనర్లు, క్యాబ్‌ యజమానులు ప్రయివేటు ఫైనాన్స్‌ లేదా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని వాహనాలు కొనుగోలు చేస్తున్నవారే. ప్రతినెలా ఈఎమ్‌ఐ కట్టక తప్పని పరిస్థితి. దానికోసమైనా ఈ సంస్థలకు అనుసంధానం కాకతప్పడం లేదని అనేకమంది రైడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు యాప్‌ ఆధారిత సేవలు సులభంగా ఉండటంతో వారూ దాన్నే ఆశ్రయిస్తున్నారు. తనవి కాని వాహనాలను తనవిగా చూపించి ప్రయాణీకులను, ప్రయాణీకుల డిమాండ్‌ను చూపించి రైడర్లను యాప్‌ ఆధారిత రవాణా సంస్థలు వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటు న్నాయి. ఈఎమ్‌ఐలు, పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులు, భారీగా పెరిగిన ఇన్సూరెన్స్‌ చార్జీలు, పొల్యూషన్‌ సర్టిఫికెట్లు, ఏటా ఆర్టీఏ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, వాహన తరుగుదల, మరమ్మతులు, ఏడాదికోసారి యాప్‌ ఆధారిత సంస్థలకు చెల్లించాల్సిన వార్షిక రుసుములు ఇలా వారు సంపాదించిన సొమ్ములో 80 శాతం వాహన నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. మరోవైపు క్యాబ్‌లు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసే ప్రయాణీకులకు సంస్థలు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీనితో యాప్‌ ఆధారిత సంస్థలకు వినియోగదారులు పెరుగుతుంటే, రైడర్లు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు.
వన్‌సైడ్‌ వెర్షన్‌…
యాప్‌ బేస్డ్‌ కార్పొరేట్‌ సంస్థలు పూర్తిగా తమ వినియోగదారులను సంతృప్తి పరిచేందుకే పనిచేస్తున్నాయనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ సంస్థల కార్యాలయాలు ఏవీ స్థానికంగా అందుబాటులో ఉండవు. కాల్‌ సెంటర్లే దిక్కు. తమ సమస్యల్ని ఏకరువు పెట్టుకొనేందుకు డ్రైవర్లు… ‘ఊబర్‌’ హైదరాబాద్‌ శాఖ కార్యాలయంలో బౌన్సర్లను దాటుకొని వెళ్లడం అసాధ్యం. వెళ్లినా వారి నుంచి ఎలాంటి హామీ, ఆర్థిక చేయూత ఉండట్లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఇక ‘ఓలా’ సంస్థ ఆఫీసు బెంగలూరులో ఉంది. అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు డ్రైవర్లు ఇష్టపడరు. కార్పొరేట్‌ మాయాజాలంలో భాగంగా కంపెనీలు తమ కార్యకలాపాలు సాగే రాష్ట్రాల్లో శాఖల్ని స్థాపించకుండా, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తాయి. ఫిర్యాదుల్ని ఫిల్టర్‌ చేయడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. వినియోగదారులు డ్రైవర్లపై ఉద్దేశ్యపూర్వకంగా ఏదైనా ఫిర్యాదు చేస్తే, తక్షణం స్పందించి, డ్రైవర్‌ ఐడీని బ్లాక్‌ చేస్తారు. అదే డ్రైవర్‌ ప్రయాణీకుల నుంచి సమస్యలు ఎదుర్కొంటే, వాటి పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపే వ్యవస్థ అక్కడ లేదు.
పేరుకే ‘గో హౌం’…
యాప్‌ ఆధారిత కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చిన రైడ్‌లు ముగిశాక, డ్రైవర్‌ ఇంటికి తిరిగివెళ్ళేందుకు ‘గో హౌం’ ఆప్షన్‌ ఉంటుంది. డ్రైవర్లతో ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకొనేముందు ఈ అప్షన్‌ను నోటి మాటగా చెప్తారు. యాప్‌లో కూడా ఉంటుంది. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చాక, డ్రైవర్‌ తన ఇంటి నుంచి చాలా దూరంలో ఉంటాడు. అలాంటి సమయంలో ‘గో హౌం’ ఆప్షన్‌ ఎంచుకుంటే డ్రైవర్‌ ఇంటికి వెళ్లే దారిలోనే రైడ్‌ను ఇవ్వాలి. ఆ రైడ్‌ కోసం గంటల తరబడి ఎదురు చూసినా రాదు. దీంతో తప్పనిసరై, అంతదూరం నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు చేసుకొని ఖాళీగా ఇంటికి రావల్సి వస్తుంది.
పార్కింగ్‌ దోపిడీ…
గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా యాప్‌ బేస్డ్‌ కార్పొరేట్‌ సంస్థల సేవలు అందుబాటులో ఉన్న పట్టణాల్లో క్యాబ్‌లు, టూ వీలర్లకు ఎక్కడా పార్కింగ్‌ సౌకర్యాలు లేవు. ఓ రైడ్‌ అయిపోయాక, మరో రైడ్‌ వచ్చేవరకు రోడ్డు పక్కనే కార్లు నిలుపుకొని వెయిట్‌ చేయాలి. ఆ సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు నో పార్కింగ్‌ ఫోటోలు తీసి, జరిమానాలు విధిస్తున్నారు. అలాగే సిగళ్ల దగ్గర జీబ్రా లైన్లు దాటినా జరిమానాల పేరుతో డ్రైవర్లను దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి వాటికి ఊబర్‌, ఓలా వంటి సంస్థలు ఏమాత్రం బాధ్యత వహించే పరిస్థితులు లేవు. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక్క ట్రాఫిక్‌ జరిమానాతో కొట్టుకుపోతోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగుబోతుల వీరంగం
కొందరు ప్రయాణీకులు తప్పతాగి అర్థరాత్రుళ్లుక్యాబ్‌లు బుక్‌ చేస్తారు. ఆ రైడ్‌ను క్యాన్సిల్‌ చేస్తే, క్యాబ్‌ డ్రైవర్‌కు పెనాల్టీ విధిస్తారు. ప్రయాణీకుడు తాగి ఉన్నాడని కాల్‌సెంటర్‌కు చెప్పినా, అటునుంచి ఎలాంటి సమాధానం రాదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో తాగుబోతు ప్రయాణీకులు తమ కార్లలోనే వాంతులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని వాపోతున్నారు. మరికొందరు డబ్బులు ఇవ్వకుండా ఘర్షణ పడతారనీ, అలాంటి సమయాల్లో తమకు కార్పొరేట్‌ సంస్థల నుంచి ఎలాంటి భరోసా, భద్రత లభించట్లేదని చెప్తున్నారు.
ప్రభుత్వమే యాప్‌ రూపొందించాలి
పీ శ్రీకాంత్‌, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌)
రవాణారంగంలో కార్పొరేట్‌ దోపిడీని నివారించేందుకు ప్రభుత్వమే స్వయంగా ఓ యాప్‌ను రూపొందించాలి. మూడేండ్లుగా మేం ఈ డిమాండ్‌ వినిపిస్తున్నాం. మాకు ఈ యాప్‌ ఉచితంగా ఏమీ వద్దు. 7 నుంచి 8 శాతం కమిషన్‌ ప్రభుత్వం తీసుకొని నిర్వహణ చేయాలి. దీనివల్ల ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది. డ్రైవర్లకూ అధిక ఆదాయం, రక్షణ లభిస్తాయి.
భారాలు భరించలేకున్నాం
షేక్‌ సలాఉద్దీన్‌, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌
యాప్‌ ఆధారిత కార్పొరేట్‌ సంస్థల దోపిడీని భరించలేకున్నాం. దానికి తోడు ప్రభుత్వం కూడా ఇదే తరహా దోపిడీని కొనసాగిస్తోంది. గ్రీన్‌ ట్యాక్స్‌ గతంలో రూ.1,100 ఉండేది. ఇప్పుడు క్యాబ్‌ల సామర్థ్యాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెంచారు. రోడ్‌ ట్యాక్స్‌నూ భారీగా పెంచారు. క్యాబ్‌ డ్రైవర్ల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం కచ్చితంగా వీటికి పరిష్కారాలు చూపాలి.
తప్పట్లేదు…
సంతోష్‌, క్యాబ్‌ డ్రైవర్‌, మల్కాజ్‌గిరి
అప్పుచేసి క్యాబ్‌ కొన్నా. నెలంతా కష్టపడినా, కుటుంబాన్ని పోషించుకొనే స్థాయిలో ఆదాయం లేదు. ఈఎమ్‌ఐ, ప్రభుత్వ టాక్స్‌లు కట్టడానికే సరిపోతుంది. అగ్రిమెంట్‌ సమయంలో లాభాలను భారీగా చూపించారు. ఆ తర్వాత బుకింగ్స్‌ ఇవ్వడం తగ్గించి, కంపెనీ కమిషన్‌ పెంచుకున్నారు. దీంతో శారీరక శ్రమ పెరిగింది.
సొంత గిరాకీలు రావట్లేదు
అబ్దుల్‌ నయీం, క్యాబ్‌ డ్రైవర్‌, చాంద్రాయణగుట్ట
యాప్‌ బేస్డ్‌ కంపెనీల్లో కమిషన్‌ పెరగడంతో లాభాలు తగ్గాయి. బుకింగ్స్‌ తగ్గాయి. దీంతో రెండు నెలలు ఆ కంపెనీలకు దూరంగా ఉన్నా. కానీ వ్యక్తిగతంగా వచ్చే గిరాకీలు పూర్తిగా తగ్గిపోయాయి. కారు ఈఎమ్‌ఐ కట్టేందుకూ అప్పులు చేయాల్సి వచ్చింది. తప్పనిసరై మళ్లీ యాప్‌కు కనెక్ట్‌ కావాల్సి వచ్చింది. కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. కానీ పనిచేయక తప్పట్లేదు.
నిటి ఆయోగ్‌ దుర్నీతి
ఊబర్‌, ఓలా వంటి యాప్‌ బేస్డ్‌ ఆధారిత కార్పొరేట్‌ సంస్థలపై 2022లో నిటి అయోగ్‌ ఓ అధ్యయనం చేసింది. దానిలో పై సంస్థల్లో రైడర్లుగా పనిచేస్తున్నవారెవరికీ ఇది ప్రధాన ఆదాయ వనరు కాదని పేర్కొంది. అసలు వారిని కార్మికులుగా గుర్తించేందుకు కూడా అంగీకరించలేదు. ఇక్కడ పనిచేసేవారంతా తమకు సౌకర్యవంతమైన సమయంలో, తక్కువ పనిగంటల్లో అదనపు ఆదాయన్ని సముపార్జించుకోవాలని చూసే వారేనని స్పష్టం చేసింది. ఈ వాదనపై బెంగలూరులోని నేషనల్‌ లా స్కూల్‌, లేబర్‌ స్టడీస్‌ సెంటర్‌, మౌంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థలు తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌ (టీజీపీడబ్ల్యూయూ) సహకారంతో హైదరాబాద్‌లో అధ్యయనం చేశాయి. నిటి అయోగ్‌ వాదన ఏమాత్రం హేతుబద్ధమైంది కాదనీ, ఈ యాప్‌ ఆధారిత రవాణా సంస్థల్లో పనిచేస్తున్న మెజారిటీ డ్రైవర్లకు ఇదే ప్రధాన ఆదాయ వనరు అని నిరూపణ చేశాయి. వాహన యజమానుల ఆదాయాలు, ఖర్చులు అంచనా వేసి యాప్‌ ఆధారిత కార్పొరేట్‌ సంస్థల దోపిడీని బహిర్గతం చేశాయి.

Spread the love