వరద సాయం పెంచాలి

– జాతీయ విపత్తు నిధులు విడుదలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి
– బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి : సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
– ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ(ఎం) బృందాల పర్యటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వరద సాయం రూ.రెండు వేల కోట్లకు పెంచాలనీ, బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. వరద నష్టానికి క్యాబినెట్‌లో ప్రకటించిన రూ.500 కోట్లు ఏ మాత్రం సరిపోవని తెలిపారు. క్షేతస్థాయిలో వరదనష్టాన్ని అంచనా వేసి జాతీయ విపత్తు నిధులను విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో పదిరోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలొచ్చిన ప్రాంతాల్లో తమ పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు గతనెల 29, 30 తేదీల్లో పర్యటించి, పలు అంశాలను పరిశీలించారని తెలిపారు. బాధితులతో మాట్లాడి సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. వరంగల్‌, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య, ములుగు జిల్లాలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, జనగామ జిల్లాలో అఖిల భారత నాయకులు హన్నన్‌మొల్ల, బి వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్‌, భద్రాద్రి కొత్తగూడెంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి సుదర్శన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు పర్యటించారని వివరించారు. ఆయా జిల్లాల కార్యదర్శులు, జిల్లా, స్థానిక నాయకత్వం కూడా ఈ పర్యటనలో పాలుపంచుకున్నదని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేసి ఆదుకున్నారని పేర్కొన్నారు. ఆయా బృందాల దృష్టికి వచ్చిన కొన్ని ముఖ్యమైన సమస్యలను సీఎం దృష్టికి తెస్తున్నామని తెలిపారు. సానుకూలంగా స్పందించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటికోసం ఉద్దేశించిన భద్రకాళి చెరువుకు తూము లేనందున నీరు బయటకు వదిలే అవకాశం లేదని పేర్కొన్నారు. దానిపైన ఉన్న చెరువు తెగుతుందని అధికారులు ఆ నీటిని భద్రకాళి చెరువులోకి వదలడంతో కట్ట తెగిందని వివరించారు. ఈ చెరువుకు గేట్లు ఏర్పాటు చేస్తామంటూ 2020లో మంత్రి కేటీఆర్‌ తన పర్యటన సందర్భంగా వాగ్దానం చేసినా నేటికీ ఆ దిశగా ప్రయత్నమేమీ జరగలేదని తెలిపారు. వరంగల్‌ జిల్లాలో రూ.268 కోట్లు, హన్మకొండ జిల్లాలో రూ.206 కోట్లు మొత్తం రూ.474 కోట్లు వరద నష్టం జరిగినట్టు క్షేత్రస్థాయి పర్యటనలు ఏ ఒక్కచోట చేయకుండానే అధికారులు అంచనాలు వేశారని విమర్శించారు. వాస్తవంగా ఈ నష్టం మరో నాలుగు రెట్లు ఉంటుందని తమ బృందం భావిస్తున్నదని పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి
–  అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద నష్టంపై వాస్తవిక అంచనా వేయాలి.
వరి పంటకు ఎకరాకు రూ.20 వేలు, వాణిజ్య పంటలకు రూ.40 వేలు పరిహారమివ్వాలి. అదనంగా భూమి లెవలింగ్‌ కోసం ఎకరాకు రూ.50 వేలు అందించాలి. రైతును ఆదుకునేలా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి.
–  చనిపోయిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున ఇచ్చి ఆదుకోవాలి.
– ఇండ్లు కూలిపోయిన వారికి డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నవారికి రూ.3 లక్షల పరిహారం అందించాలి.
– ప్రతి కుటుంబానికీ నెల రోజులకు సరిపోయే నిత్యావసరాలు, తిండి సామాగ్రి అందించాలి. మంచినీటి సరఫరా చేయాలి.
–  భద్రకాళి చెరువుకు గేట్లు నిర్మించాలి. నీట మునిగిన పేదల ఇండ్లకు మరమ్మత్తు చేయించాలి.
– దెబ్బతిన్న జాతీయ, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రహదారులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి.
– అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతిగ్రామానికీ వైద్య బృందాలను పంపి వైద్యంతోపాటు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి.
– సీఎం ఇచ్చిన వాగ్దానం ప్రకారం భద్రాచలం కోసం రూ.వెయ్యి కోట్లు వెంటనే విడుదల చేయాలి.
– గోదావరి కరకట్టను పటిష్టం చేసి, సుభాష్‌నగర్‌ వరకు పొడిగించాలి.

Spread the love