గృహలక్ష్మి దరఖాస్తు గడువు పెంచాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు గడువును నెలరోజుల వరకు పెంచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వంత ఇంటి జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే పేదలు గృహలక్ష్మి పథకం కోసం ఈనెల 10లోపే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, సాంకేతిక కారణాలతో పనిచేయకపోవడం వల్ల ఈ గడువు సరిపోదని పేర్కొన్నారు. ఫలితంగా కొంతమంది అర్హులు ఈ పథకానికి దూరమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి దరఖాస్తు గడువును మరో నెలరోజుల వరకు పొడిగించాలనీ, ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. మొదటి విడత గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికీ మూడువేల ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ మార్గదర్శకాల్లో పేర్కొన్న కొన్ని అంశాల వల్ల కొంతమంది అర్హులు దూరమవుతున్నారని వివరించారు. వేలాది ఆహార భద్రత కార్డుల దరఖాస్తులను పరిష్కరించకుండా ప్రభుత్వం తన దగ్గర పెండింగ్‌లో పెట్టుకోవడంతో చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు, చిన్నచిన్న రేకుల రూములు వేసుకుని నివసిస్తున్న పేదలు 59 జీవో కింద ఇంటి స్థలాలు పొందారని తెలిపారు. వారికి ప్రభుత్వం మొండిచెయ్యి చూపడం సరైందికాదని విమర్శించారు. ఎన్నికల ముందు డబుల్‌బెడ్రూం ఇండ్లకు రూ.ఐదు లక్షలిస్తామన్న హామీని రూ.మూడు లక్షలకు కుదించడంతో పేదల ఇంటి నిర్మాణం భారంగా మారనుందని తమ్మినేని పేర్కొన్నారు. అర్హులందరికీ ఈ పథకంలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
20 రోజులు పొడిగించాలి : ప్రజాపంథా
గృహలక్ష్మి పథకం దరఖాస్తు గడువును 20 రోజులు పొడిగించాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు. ఇండ్లులేని నిరుపేదలందరికీ షరతుల్లేకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసేందుకు మూడు రోజులే గడువు ఇచ్చారని తెలిపారు. కులం, నివాసం, ఆదాయం, భూమి పేపర్లు, ఫొటోలు, ఓటర్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌ ఇవన్నీ తయారు చేసుకునే వరకు మూడు రోజులు గడిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే దరఖాస్తుకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఈ పథకాన్ని అటకెక్కించే ఉద్దేశం కనిపిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయా ల్లో లబ్దిదారులకు ఎలాంటి అక్నాలెడ్జ్‌మెంట్‌ కార్డు ఇవ్వకుండా బాక్సుల్లో వేయించడం సరైంది కాదని తెలిపారు.
దరఖాస్తు ఏమైందో తెలుసుకుని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొ న్నారు. ఇందిరమ్మ ఇండ్లు పొందిన వారిని అనర్హులు గా ప్రకటిస్తే లక్షలాది మంది పేదలు అన్యాయానికి గురవుతారని తెలిపారు. వాటికి సంబంధం లేకుం డానే ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తగిన సమయం ఇవ్వకపోతే పేదల పక్షాన పోరాటాలు చేయకతప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

Spread the love