– సేవలకు తగ్గ జీతభత్యాలివ్వాలి: సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రద్దయిన 104 వాహన సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి, వారి సేవలకు తగ్గ జీతభత్యాలివ్వాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. 2008లో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 104 సేవలను ప్రారంభించిందని గుర్తు చేశారు. పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి దీర్ఘకాలిక వ్యాధులకు మందులిస్తూ, టెస్టులు చేస్తూ మెరుగైన సేవ లందించిందని తెలిపారు. కానీ పల్లె దవాఖానాలు, ఇంటింటికీ ఎన్‌సీడీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆ సేవలు అవసరం లేదంటూ గతేడాది డిసెంబర్‌లో రద్దు చేసిందని పేర్కొన్నారు. ల్యాబ్‌టెక్నీషియన్ (ఎల్టీ), ఫార్మాసిస్టులను వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి ఆదేశాల్లేకుండా తిరిగి ఉద్యోగాల్లో నియమించారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత కూడా లేదని పేర్కొన్నారు.
వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, ఏఎన్‌ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసిన సుమారు 1,350 మంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక ఇబ్బం దులెదుర్కొంటున్నారని వివరించారు. 104ను ఎత్తేసే సమయంలో వారందరినీ ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఆరోగ్యశాఖ మంత్రి టి హరీష్‌రావు కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
వైద్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషీయన్లు, ఫార్మాసిస్టులను ప్రభుత్వం ఇటీవలే రెగ్యులరైజ్ చేసిందని తెలిపారు.
కానీ 104 ఉద్యోగులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారికి నెలకు రూ.30 వేలు, కొత్తగా నియామకమైన ఎల్టీ, ఫార్మాసిస్టులకు రూ.27 వేల వేతనం ఇస్తున్నారని వివరించారు. గత 15 ఏండ్లుగా పనిచేస్తున్న వారికి మాత్రం కేవలం రూ.20 వేలు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఈ అరకొర జీతాలనూ ఆర్నెళ్లకోసారి కొత్తగా వచ్చే ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్టు కటింగులు చేస్తూ, సమయానికి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కరోనాలో కూడా వారు విలువైన సేవలందించారని గుర్తు చేశారు. మరో ఉద్యోగం కోసం నియామకమయ్యే వయస్సునూ వారు దాటి పోయారని తెలిపారు.