కాంగ్రెస్ హిందూ సమాజాన్ని విభ‌జించేందుకు ప్ర‌యత్నిస్తోంది : మోడీ

నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజాన్ని విభ‌జించేందుకు ప్ర‌యత్నిస్తోంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆరోపించారు. గుజ‌రాత్‌లోని సురేంద్ర‌న‌గ‌ర్‌లో గురువారం జరిగిన ఎన్నిక‌ల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగించారు. కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ద్వేష‌పూరిత ఉద్దేశంతోనే శివుడు, రాముడిపై ప్ర‌క‌ట‌న చేశార‌ని మండిప‌డ్డారు. రామ‌, శివ భ‌క్తుల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మోడీ ఆరోపించారు. మ‌న ఆచార వ్య‌వ‌హారాలు వేలాది సంవ‌త్స‌రాల నుంచి వేళ్లూనుకున్నాయ‌ని, మ‌న ఆచార వ్య‌వ‌హారాల‌ను చివ‌రికి మొఘ‌లులు కూడా విచ్ఛిన్నం చేయ‌లేక‌పోయార‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాటిని విచ్ఛిన్నం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు. నెల రోజుల కిందట రాహుల్ గాంధీ శ‌క్తిని ధ్వంసం చేస్తాన‌ని చెప్పార‌ని గుర్తుచేశారు. తాము శ‌క్తిని ప్రార్ధించేవార‌మ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. రిజ‌ర్వేష‌న్ల‌పై వాస్త‌వాల‌ను తాను బ‌య‌ట‌పెట్టిన‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్ గ‌తి త‌ప్పింద‌ని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించిన తీరును తాను ఎండ‌గ‌ట్ట‌డంతో ఉక్కిరిబిక్కిరైన కాంగ్రెస్ వ‌రుస‌గా అస‌త్యాల‌ను వ‌ల్లెవేస్తోంద‌ని ప్ర‌ధాని ఆరోపించారు.

Spread the love