– నేడు బెంగళూరులో ప్రతిపక్షాల కీలక భేటీ
– సబ్ కమిటీల ఏర్పాటు సహా ఆరు ప్రధాన అంశాలపై చర్చలు
– ఉమ్మడి కార్యక్రమం కూడా ఖరారయ్యే అవకాశం
బెంగళూరు: మంగళవారం 24 పార్టీలకు పైగా పాల్గొనే ప్రతిపక్షాల మెగా భేటీలో యూపీఏ పేరు మార్పు దిశగా విస్తృతంగా చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. మంగళవారం నాటి సమావేశంలో ఆరు ప్రధాన అంశాలపై 24 పార్టీల నేతలు చర్చించనున్నారు. సోమవారం ఇష్టాగోష్టి సమావేశం జరిపిన నేతలు తిరిగి మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశమవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం కూటమి ముందుకు సాగడం కోసం వివిధ సబ్ కమిటీలను ఏర్పాటు చేసుకోనున్నారు. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో సబ్ కమిటీల ఎన్నిక అనంతరం విపక్షాలను లీడ్ చేయడం కోసం ఒక నేతను కూడా ఈ సమావేశంలోనే ఎన్నుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ముగిసిన అనంతరం 4 గంటలకు ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్‌ను నిర్వహించనున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఖరారు చేయడంతో పాటు రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటుపైనా ఈ సమావేశంలో చర్చలు జరపనున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు విపక్షాలను ఏకం చేసే దిశగా అవసరమైన వ్యూహాలను కూడా ఖరారు చేసేందుకు అవకాశం వుంది. విపక్షాలు ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ కోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. అలాగే ఈవీఎంలు, ఎన్నికల సంస్కరణలపైన కూడా ఈ సమావేశంలో విపక్షాలు చర్చించనున్నాయి.
ప్రతిపక్షాల సంకీర్ణం పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రేపటి సమావేశంలోనే సమిష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యూపీఏ పేరు మార్పుపై విస్తతంగా చర్చించిన అనంతరమే ఒక నిర్ణయం వుంటుందని చెప్పారు. అయితే దీనంతంటికీ కొంత సమయం పడుతుందని కాంగ్రెస్ అంగీకరించింది. ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటుండగా నితీశ్‌కుమార్ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్(డీఎంకే), హేమంత్ సోరెన్(జేఎంఎం), ఉద్ధవ్ థాకరే(ఎస్‌ఎస్-యుబీటీ), శరద్ పవార్(ఎన్‌సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్ యాదవ్ (ఆర్‌జేడీ), అఖిలేశ్ యాదవ్ (ఎస్‌పీ), సీతారాం ఏచూరి (సీపీఐ-ఎం), ఒమర్ అబ్దుల్లా (ఎన్‌సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ-ఎంఎల్) తదితరులు పాల్గొంటారు. ఢిల్లీలో పాలనా యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని విమర్శించింది. దీనిపై మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.
దీనిపై ఆప్ స్పందించింది. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. ఆ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు.
మోడీ విధానాలతో ఆర్ధిక వ్యవస్ధ విధ్వంసం : సిద్ధరామయ్య
దేశ ఆర్ధిక వ్యవస్ధను ప్రధాని నరేంద్ర మోడీ నాశనం చేశారని కర్నాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య విమర్శించారు. అనాలోచిత నిర్ణయాలు, అపరిపక్వ విధానాలతో ఆర్ధిక వ్యవస్ధను ఛిన్నాభిన్నం చేసింది మోడీ సర్కారేనని, ప్రతిపక్షాలు కాదని స్పష్టం చేశారు. బెంగళూర్‌లో మంగళవారం జరగనున్న ప్రతిపక్షాల సమావేశం సందర్భంగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు నగరానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు.