పసలేని వాదనలతో కాలయాపన

– ఈడీ చీఫ్‌ను కొనసాగించేందుకు తంటాలు
– బీజేపీ చేతిలో కీలుబొమ్మ
– అది విశ్వసనీయత కోల్పోయింది
– ఈడీపై కాంగ్రెస్‌ ఎంపీ సుర్జేవాలా మండిపాటు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు నుండి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతి ఎస్‌కే మిశ్రాను పదవిలో కొనసాగించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం గత రెండు సంవత్సరాలుగా సర్వోన్నత న్యాయస్థానంలో పసలేని వాదనలు వినిపిస్తోంది. తాజాగా ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌)పై సమీక్ష చేయాల్సి ఉన్నదని, ఇందులో మిశ్రా కీలక వ్యక్తి అని, కాబట్టి ఆయన పదవీకాలాన్ని పొడిగించాల్సిన అవసరం ఉన్నదని వాదించింది. ఎఫ్‌ఏటీఎఫ్‌ అనేది అంతర్జాతీయ ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయంపై కన్నేసి ఉంచే విభాగం. ఎఫ్‌ఏటీఎఫ్‌పై సమీక్ష ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలైంది. వచ్చే సంవత్సరం చివరి వరకూ అది కొనసాగుతుంది. మిశ్రా పదవీకాలం ఈ సంవత్సరం నవంబరుతో ముగియాల్సి ఉంది. దేశంలో 40 పారామితులపై సమీక్షలు జరుగుతాయి. వాటిలో మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జరిపే సమీక్ష ఒకటి. ఈ విషయాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేయలేదు. వాస్తవానికి ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రెవెన్యూ శాఖకు జవాబుదారీగా ఉంటుంది. 2019 నుండి మిశ్రా రెవెన్యూ కార్యదర్శి వద్ద పని చేస్తున్నారు. ఆ శాఖలో ముగ్గురు కార్యదర్శులు ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల విభాగంలో కూడా అంతే. ఏదైనా విభాగంలో కార్యదర్శులే కీలక పాత్ర పోషిస్తారు కానీ విచారణ సంస్థ డైరెక్టర్‌ కాదు. ఎఫ్‌ఏటీఎఫ్‌పై ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సమీక్ష జరుపుతారు. నలభై సభ్య దేశాలకు చెందిన బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. సంవత్సరంన్నర కాలంలో సమీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే సమీక్ష మొదలైంది. వచ్చే సంవత్సరం చివరి వరకూ తుది నివేదికను సమర్పించరు.
అసలు ఈడీ పనితీరును పరిశీలిస్తే ఆ సంస్థ ఏర్పడినప్పటి నుండి నేటి వరకూ ఆరు వేల కేసులు దాఖలయ్యాయి. వీటిలో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టానికి సంబంధించి 25 కేసుల్లో విచారణ పూర్తయింది. ఇరవై నాలుగు కేసుల్లో శిక్షలు పడ్డాయి. 2018-19 నుండి 2021-22 మధ్యకాలంలో ఈడీ నమోదు చేసిన కేసులు 505% పెరిగాయి. 2018-19లో 195 కేసులు నమోదైతే 2020-21 నాటికి 1,180 కేసులు నమోదయ్యాయి. ఈడీ దాడులు 2004-14 నుండి 2014-22 వరకూ భారీగా అంటే 2,555% పెరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2004-14 మధ్య ఈడీ 112 దాడులు చేసి రూ.5,346 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. అయితే ఎన్ని కేసులలో దర్యాప్తు పూర్తయి విచారణ ప్రారంభమైంది? ఎన్ని కేసులు నమోదయ్యాయి? వేర్వేరు కారణాలతో ఎన్ని కేసులను ముగించారు? కోర్టులలో ఫిర్యాదు దాఖలైన తర్వాత ఎంతమంది నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టారు? అటాచ్‌ చేసిన ఆస్తులలో ఎన్నింటిని జప్తు చేశారు? వంటి ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు.
బీజేపీ చేతిలో కీలుబొమ్మ
న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని, ఆ సంస్థ తన విశ్వసనీయతను కోల్పోయిందని కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా విమర్శించారు. ఈడీ అధిపతి పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈడీ అధిపతి సంజరు కుమార్‌ మిశ్రా పదవీకాలాన్ని 2021 నవంబర్‌లోనూ, తిరిగి 2022 నవంబర్‌లోనూ పొడిగించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అయితే నూతన అధిపతి నియామకంపై కేంద్రం చేసిన అభ్యర్థన మేరకు మిశ్రా ఈ నెల 21 వరకూ పదవిలో కొనసాగేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2021 తర్వాత మిశ్రా తీసుకున్న నిర్ణయాలన్నీ చట్టవిరుద్ధమేనని సుర్జేవాలా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేస్తూ రెండు పర్యాయాలు పదవీకాలాన్ని పొడిగించినందుకు రాజకీయ నాయకులు, అధికారులు బాధ్యత వహించరా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయానికి లభించిన విజయమని ఆయన అభివర్ణించారు. వ్యక్తులు ముఖ్యం కానప్పుడు మిశ్రా పదవీకాలాన్ని ఎందుకు పొడిగించారని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు.

Spread the love