ఎన్నికలకు సిద్ధంకండి

– పార్టీలో ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు
– విభేదాలుంటే నాతో లేదా ఇన్‌చార్జితో చర్చించండి
– క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు
– కెేసీఆర్‌ను ఓడించేందుకు నేతలంతా ఐక్యంగా పనిచేయాలి: తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ కోసం ఎవరు ఏం చేశారో, ఏం చేస్తున్నారో తనకు తెలుసని అన్నారు. మంగళవారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీతో పాటు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ నేతల సూచనలు, సలహాలు విన్న రాహుల్‌ గాంధీ, నాయకులంతా ఏకతాటిపై నడవాలని కోరారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నేతలందరూ విభేదాలను, చిన్న చిన్న గొడవలను పక్కన పెట్టాలని సూచించారు. ‘విభేదాలు ఉంటే నాతో లేదా రాష్ట్ర ఇన్‌ఛార్జితో మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లో బయట మాట్లాడొద్దు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానిదే. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలి’ అని రాష్ట్ర నేతలకు రాహుల్‌ గాంధీ సూచించారు. విభేదాల పేరుతో నోటికొచ్చినట్టు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. పార్టీ కోసం అన్ని స్థాయిల్లోని నేతలూ కలిసికట్టుగా, ఐక్యంగా పని చేయాల్సిందేనని సూచించారు. కర్నాటక ఎన్నికల వ్యూహంలో అనుసరించిన విధానాన్ని సమావేశంలో ఆయన వివరించారు.
రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ : రేవంత్‌ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై పార్టీ అధిష్టానంతో చర్చించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించినట్టు ఆయన ప్రకటించారు. ‘రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించాం. మ్యానిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలనీ, అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది’ అన్నారు. పార్టీ సీనియర్‌ నేతలు, రాష్ట్ర నాయకులకు కొన్ని సూచనలు చేశారని చెప్పారు. కర్నాటకలో అవలంభించిన వ్యూహాల్లో కొన్నింటిని ఇక్కడా అమలు చేస్తామన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని అదిష్టానం సూచించినట్టు చెప్పారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే.. వీలైనంత త్వరగా సరిచేసుకుంటామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే :మాణిక్‌ రావు ఠాక్రే
కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే మాట్లాడుతూ తెలంగాణలో నేతలందరూ కలిసికట్టుగా పని చేస్తారని తెలిపారు. 100శాతం తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలపై చర్చించినట్టు తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. తెలంగాణ ఏర్పడి పదేండ్లయినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ వికాస్‌ ఉంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ అన్ని రాష్ట్రాల్లో బీజేపీతో జత కడుతుందని తెలిపారు. మహారాష్ట్రలోనూ, కాంగ్రెస్‌ గట్టిగా ఉన్న చోట బీజేపీకి లబ్దిచేకూరేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మాణిక్‌రావు ఠాక్రే విమర్శలు గుప్పించారు.
బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తులు ఉండబోవని రాహుల్‌ స్పష్టం : మధుయాష్కీ
బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తులు ఉండబోవని రాహుల్‌ స్పష్టం చేశారని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తెలిపారు. జాతీయస్థాయిలోనూ ప్రతిపక్షపార్టీలతో బీఆర్‌ఎస్‌ను భాగస్వామ్యం చెయ్యబోమని అధిష్టానం స్పష్టం చేసిందన్నారు. ‘కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయండి. ప్రజల పాలన కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి” అనే నినాదంతో ఎన్నికలకు వెళుతున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో నేతలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానా రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్‌ అలీ, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love