ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ నెలన్నర వ్యవధిలో ఇది రెండో సమావేశం
న్యూఢిల్లీ : కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతూ వస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని ఎదుర్కోవడానికీ, ప్రతిపక్షాల ఐక్యతను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఇది గత నెలన్నరలో జరిగిన రెండో సమావేశం కావటం గమనార్హం. న్యూఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్‌లోని కాంగ్రెస్ చీఫ్ నివాసంలో నితీశ్.. ఖర్గే, గాంధీని కలిశారు. ఈ సమావేశంలో ప్రతిపక్షాల ఐక్యతను పటిష్టం చేసేందుకు రోడ్‌మ్యాప్‌తో పాటు పాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశం గురించి చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్, జేడీ(యూ) చీఫ్ లాలన్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శనివారం కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి బీహార్ ముఖ్యమంత్రి కుమార్, తేజస్వీ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారైన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ఐక్యత ప్రదర్శనలో భాగంగా బీహార్ సీఎం నితీశ్ దేశంలో వివిధ ప్రతిపక్ష నాయకులు, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు, నాయకులను కలుస్తున్నారు.