ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా బహిరంగ సభలో వక్తలు

– విశాఖలో ప్రారంభమైన
ఎల్‌ఐసీఏఓఐ ఆరో జాతీయ మహాసభ
– వందలాది మందితో భారీ ప్రదర్శన
గ్రేటర్‌ విశాఖ : కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలతో ఉద్యోగులు, కార్మికులు పెను సవాళ్లను ఎదుర్కొనడమే కాక ప్రభుత్వ రంగం కనుమరుగై దేశం సర్వనాశనమయ్యే పరిస్థితులు దాపురించాయని, ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్నికల్లో కర్నాటక తరహా సమాధానం చెప్పాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. సోమవారం ఉదయం విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీఏఓఐ) ఆరో జాతీయ మహాసభ ప్రారంభమైంది. తొలుత ఎల్‌ఐసీలో ఏజెంట్ల వ్యవస్థకు హాని తలపెట్టే చర్యలను కేంద్రం విరమించుకోవాలంటూ ఎల్‌ఐసీ ఏజెంట్లు నగరంలోని ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆర్‌టీసీ కాంప్లెక్స్‌, సెంట్రల్‌ పార్క్‌ మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ జాతీయ కార్యదర్శి కె.ఉమేష్‌ మాట్లాడుతూ.. దేశంలో 2019లో రెండోసారి మోడీ అధికారం చేపట్టాక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నేషనల్‌ మానిటైజేషన్‌ పాలసీ కింద కార్పొరేట్లకు కట్టబెట్టడం, అందుకు తగ్గట్టుగా కార్మిక చట్టాలను మార్చేసి ఉద్యోగులు, కార్మికులపై దాడిచేయడం ఉధృతమైందన్నారు. కర్నాటకలో విద్యుత్‌, ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లను అసెట్స్‌ మానిటైజేషన్‌ పేరుతో రూ.29 వేల కోట్ల విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టిన ఫలితంగా అక్కడి ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 5న బీజేపీ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఢిల్లీలో లక్షల మంది కార్మికులు, ఉద్యోగులతో జరగనున్న కన్వెన్షన్‌లో ‘దేశ రక్షణ నినాదాలు’ మార్మోగనున్నాయన్నారు. బీజేపీకి లోక్‌సభలో మెజారిటీ ఉండొచ్చేమోగానీ వీధుల్లో లేదని తెలుసుకోవాలన్నారు.
నయా ఉదారవాద విధానాలతో దేశానికి ముప్పు : హేమలత
నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో ప్రభుత్వ రంగం, సహజ వనరులన్నీ కార్పొరేట్లచే లూటీ చేయబడి దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ కె.హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం విశాఖ నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆరో అఖిల భారత మహాసభ ప్రతినిధుల సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉందనీ, తాజాగా అమెరికాలోని మూడు బ్యాంకులు మూతపడ్డాయని, స్విట్జర్లాండ్‌లోనూ ఇదే స్థితి కనిపిస్తున్నదని అన్నారు. దేశంలోని పెట్టుబడిదారులు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి కార్మికుల హక్కులపై దాడి చేయడం, ఆర్థిక వ్యవస్థలను కాజేసే పథక రచనలు, సహజ వనరులను దోచేసే వ్యూహాలతో ముందుకెళ్తూ మరింత బలోపేతమవుతున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. రానున్న కాలంలో దేశ కార్మికవర్గం నయా ఉదారవాద విధానాలను ఓడించేందుకు పోరాటాలను ఉధృతం చేయాలని ఆమె కోరారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ మహాసభలో 18 రాష్ట్రాల నుంచి 500 మంది ఎల్‌ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు.

Spread the love