ప్రధాని లేకుండా మణిపూర్‌పై

అఖిలపక్ష సమావేశం అర్థరహితం : కాంగ్రెస్‌
న్యూఢిల్లీ : మణిపూర్‌ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశాన్ని కాంగ్రెస్‌ శుక్రవారం తిరస్కరించింది. ప్రధాని గైర్హాజరు కావడంతో ఈ చర్చ అర్థరహితమని కాంగ్రెస్‌ మండిపడింది. మణిపూర్‌ ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు హోంమంత్రి అమిత్‌షా జూన్‌ 24న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
గత 50 రోజులుగా మణిపూర్‌ మండిపోతున్నా ప్రధాని మౌనం వహించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని, దీంతో ఈ సమావేశం ప్రధానికి ముఖ్యమైనది కాదని స్పష్టమైందని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ లేనపుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రయోజనమేమిటని కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ప్రతినిధి జైరాం రమేష్‌ పేర్కొన్నారు. మణిపూర్‌ హింసాకాండపై ప్రధాని మౌనం వహించారని, మణిపూర్‌కు చెందిన ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీలు, సొంత పార్టీ సహచరులను కలిసేందుకు నిరాకరించారని అన్నారు. మణిపూర్‌కు శాంతి సామరస్యాలు అవసరం అయినపుడు ఢిల్లీలో సమావేశం నిర్వహించి ప్రయోజనమేమిటని అన్నారు. ప్రధాని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం అర్థం కావడం లేదు, ఇది వింతగా ఉందని అన్నారు.
మణిపూర్‌లో విధ్వంసం జరిగి 50 రోజులైన తర్వాత ఇప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమేమిటని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి. వేణుగోపాల్‌ మండిపడ్డారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను అమలు చేయకపోవడం అపహాస్యమని అన్నారు. శాంతి కోసం జరిగే ఏ ప్రయత్నమైనా మణిపూర్‌లో జరగాలని అన్నారు. అక్కడ పోరాడుతున్న వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి రాజకీయ పరిష్కారం సాధించాలని అన్నారు. ఢిల్లీలో కూర్చుని యక్యలె యునట్టడం చేస్తే ప్రయత్నలోపమేనని అన్నారు.

Spread the love