రాహుల్‌పై అనుచిత వీడియో బీజేపీ ఐటీ విభాగం చీఫ్‌పై కేసు

బెంగళూరు : బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవ్యాపై బెంగళూరు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలలో వీడియోను పోస్ట్‌ చేయడం ద్వారా ప్రజలలో శత్రుత్వాన్ని ప్రేరేపిస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని మాలవ్యాపై కర్నాటక పీసీసీ సభ్యుడు రమేష్‌ బాబు ఫిర్యాదు చేశారు. రాహుల్‌ గాంధీ పైన, కాంగ్రెస్‌ పార్టీ పైన దురభిప్రాయం కలిగించేలా ఉన్న యానిమేషన్‌ వీడియోను మాలవ్యా పోస్ట్‌ చేశారు. అంతేకాక ‘రాహుల్‌ గాంధీ ప్రమాదకారి. ఆయన ఓ కృత్రిమమైన ఆట ఆడుతున్నాడు. ఆ పార్టీ వారు మరింత ప్రమాదకారులు. భారతదేశ ప్రతిష్టను విదేశాలలో దిగజార్చేందుకు వారు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీని అప్రదిష్టపాలు చేసేందుకే వారు ఇలా చేస్తున్నారు’ అంటూ ట్వీట్‌ కూడా చేశారు. దీనిపై ఐపీసీలోని 153(ఏ), 120(బీ), 505(2), 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష ఆధారంగా వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, సుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని, కుట్రకు పాల్పడ్డారని మాలవ్యాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. తనపై కేసు నమోదు కాగానే మాలవ్యా అదే వీడియోను మళ్లీ పోస్ట్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ విదేశీ బంటు అని ట్వీట్‌ చేశారు. మాలవ్యా చర్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే మాట్లాడుతూ చట్టప్రకారం చర్యలు తీసుకుంటే బీజేపీ నాయకులు గగ్గోలు పెడుతుంటారని చెప్పారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించడంలో వారికి సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మాలవ్యాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు.

Spread the love