ఇంటి పనికి లభించని ప్రతిఫలం

అధిక పని గంటలతో మహిళ సతమతం
చెన్నయ్ : పని గంటలపై తమిళనాడులో చర్చోపచర్చలు సాగుతున్నాయి. గతంలో రోజుకు 9 పని గంటలు మాత్రమే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని 12కు పెంచింది. అయితే భాగస్వామ్య పక్షాలు, కార్మికులు, కార్మిక సంఘాలు, ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ దీనిపై రాష్ట్రంలో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. పని గంటలు పెంచితే ఉత్పత్తి పెరుగుతుందని పారిశ్రామికవేత్తలు వాదిస్తుంటే 8 గంటలకు మించి పని చేస్తే కార్మికులు అలసిపోతారని, వారి సమర్ధతపై ప్రభావం పడుతుందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. పని గంటలను పెంచితే ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కుకు విఘాతం కలుగుతుందని కార్మికులు వాదిస్తున్నారు.
పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోంది. అటు పని ప్రదేశాలలోనూ, ఇటు ఇంటి వద్ద పని చేస్తూ వారు అధిక శారీరక శ్రమకు గురవుతున్నారు. ఇంటి వద్ద చేసే పనికి ఎలాగూ వేతనం అంటూ ఉండదు. అంటే ఏమిటి? కర్మాగారాలలో పని చేస్తే వచ్చే జీతంతోనే వారు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పని గంటలు మాత్రం అధికం. ఒక్క మాటలో చెప్పాలంటే వారు రెండు షిఫ్టులలో పని చేస్తున్నారన్న మాట. ఉదాహరణకు తమిళనాడు గ్రామీణ ప్రాంతాలలో 92.9% మంది, పట్టణ ప్రాంతాలలో 90.4% మంది మహిళలు చేసే పనికి ఎలాంటి ప్రతిఫలం లభించడం లేదు. ఎనిమిది గంటలకు వేతనం తీసుకుంటూ రోజుకు 12-13 గంటలు పని చేస్తున్నారన్న మాట. వీరికి కార్మిక చట్టాలేవీ వర్తించవు. ఎక్కువ గంటలు పని చేయడాన్ని శ్రమ దోపిడీగా పరిగణించడం లేదు. అది ఓ భార్య లేదా తల్లి బాధ్యత అని వితండవాదం చేస్తున్నారు.
వేతనంతో కూడిన పనిలోనూ పురుషులు, మహిళల మధ్య తేడా కన్పిస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. నెలవారీ మహిళా విద్యా నిధిని ప్రవేశపెట్టింది. మధ్యాహ్న భోజన పథకంలో అల్పాహారాన్ని చేర్చింది. పని గంటల బిల్లు విషయంలో వెనక్కి తగ్గినప్పటికీ మహిళల శారీరక శ్రమను మాత్రం అర్థం చేసుకోవడం లేదు.
ఇక దేశంలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఓ నివేదిక ప్రకారం 15-29 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో 85% మంది ఎలాంటి ప్రతిఫలం లేకుండానే ఇంటి పనులు చేస్తున్నారు. వీరి శ్రమకు గుర్తింపు లభించడం లేదు. ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 76.7% మంది, పట్టణ ప్రాంతాలలో 81.1% మంది మహిళలు చేసే పనిని ఉత్పాదకత లేని పనిగా పరిగణిస్తున్నారు. అంటే ఇంటి పనిని లెక్కలోకి తీసుకోవడం లేదు. మహిళలు తాము కర్మాగారాలు, ఇతర పని ప్రదేశాలలో చేసే పని కంటే ఇంటి వద్ద నాలుగైదు గంటలు ఎక్కువ సమయమే పని చేస్తున్నారు. అదే పురుషులైతే కేవలం గంటన్నర మాత్రమే ఇంటి పనికి కేటాయిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా పురుషుల పైన ఆధారపడాల్సి రావడంతో వారు వృత్తివిద్యకు, నైపుణ్యాభివృద్ధికి దూరమవుతు న్నారు. గృహహింసకు సైతం గురవుతున్నారు.

Spread the love