పూజారుల నియామకంలో కులానికి పాత్ర లేదు

చెన్నై : ఆలయ పూజారుల నియామకాల్లో ‘కులం ప్రాతిపదికగా వుండే పూర్వీకుల వంశ క్రమం’ ఎలాంటి పాత్ర పోషించదని మద్రాసు హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. వేదాల గురించి, వేద కర్మల గురించి బాగా తెలిసి వుండడమే ఇటువంటి నియామకాలకు వుండాల్సిన ఏకైక ప్రామాణికమని పేర్కొంది. సేలం లోని శ్రీ సుగవనేశ్వరర్‌ స్వామి ఆలయంలో అర్చక పదవుల ఖాళీల భర్తీకి చేసిన ప్రకటనను సవాలు చేస్తూ 2018లో ముత్తు సుబ్రమణియ గురుకుల్‌ రిట్‌ పిటిషన్‌ వేశారు. ఆలయంలో అనుసరించే ఆగమ సిద్ధాంతాలను నియామకాల్లో తప్పనిసరిగా పాటించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పైగా ఈ విషయంలో పిటిషనర్‌, ఇతరుల వారసత్వపు హక్కును ఈ ఉద్యోగ ప్రకటన ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుండి ఆలయంలో వారసత్వ సేవలను అందిస్తున్న తమకే ఈ పదవి రావాలని పిటిషనర్‌ భావించారు. దానిపై జస్టిస్‌ ఎన్‌.ఆనంద్‌ వెంకటేష్‌ తీర్పు చెబుతూ, ఆలయంలో పూజారుల నియామకం ఆగమ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుందన్నారు. అయితే, సుప్రీం కోర్టు రూలింగ్స్‌ను ఉటంకిస్తూ, పూజారి కులం అనేది మతంలో అంతర్భాగం కాదని ఆ ఉత్తర్వు పేర్కొంది. కులం, జాతితో సంబంధం లేకుండా, ఏ వ్యక్తిని అయినా అర్చకుడిగా నియమించవచ్చునని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి. అయితే ఈ పదవికి అవసరమైన పరిజ్ఞానం ఆ వ్యక్తి కలిగివుండడం తప్పనిసరని స్పష్టం చేసింది.

Spread the love