– డిఎంకె తెచ్చిన సామాజిక న్యాయం : స్టాలిన్
చెన్నై : ఏ కులానికి చెందిన వారినైనా ఆలయ ఆర్చకులుగా నియమించడం రాష్ట్రంలో డిఎంకె తీసుకొచ్చిన సామాజిక న్యాయమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ (హెచ్‌ఆర్‌అండ్‌సిఇ) శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని దేవాలయాల తరపున 34 జంటలకు జరిగిన సామూహిక వివాహా వేడుక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ఆలయ ఆర్చకులుగా ఏ కులానికి చెందిన వారైనా ఉండొచ్చని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డిఎంకె ప్రభుత్వం ఈ సామాజిక న్యాయాన్ని తీసుకుని వచ్చింది’ అని చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్కర్నీ ఆలయాల్లో అర్చకులుగా అనుమతించే ‘ద్రావిడ మోడల్’ ప్రభుత్వమే, నిజమైన సామాజిక న్యాయమని స్టాలిన్ చెప్పారు. తమిళనాడు స్ఫూర్తితో రాజస్థాన్ ప్రభుత్వం కూడా వివిధ ఆలయాల్లో ఎనిమిది మంది మహిళలతో సహా మొత్తం 17 మందిని అర్చకులుగా నియమించిందని స్టాలిన్ తెలిపారు. అలాగే, హిందూ దేవాలయాల నిర్వహణ కోసం హెచ్‌అర్‌అండ్‌సిఇ శాఖను సృష్టించింది కూడా తమ జస్టిస్ పార్టీ అని స్టాలిన్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ శాఖ రాష్ట్రంలో 43 వేల ఆలయాల నిర్వహణను పర్యవేక్షిస్తుందని తెలిపారు. పురాతన ఆలయాల నిర్మాణలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పునర్నిర్మాణం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌అండ్‌సిఇ మంత్రి పికె శేఖర్‌బాబు, ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మా. సుబ్రమణియన్, మైనారిటీల సంక్షేమం- ప్రవాస తమిళుల సంక్షేమ శాఖ మంత్రి జింగీ కెఎస్ మస్తాన్, చెన్నై కార్పొరేషన్ మేయర్ ఆర్.ప్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు.