కులమతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీని చిత్తుగా ఓడిద్దాం

– సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌
నవతెలంగాణ-సత్తుపల్లి
కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీని 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌ అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య అధ్యక్షతన దళిత వర్గాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంద కృష్ణమాదిగ బీజేపీకి ఓటెయ్యమని దళిత వర్గాలను కోరడం దురదృష్టకరమన్నారు. కృష్ణమాదిగ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తారతమ్యాలు లేకుండా ఎస్సీ వర్గాలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డికి అత్యధిక మెజారిటీ తెచ్చి పెట్టేందుకు ఎస్సీ వర్గాలన్నీ కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి మించి ఆధిక్యత సాధించుకుందామన్నారు. ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య మాట్లాడుతూ విషవృక్షం లాంటి బీజేపీకి ఓటెయ్యాల్సిన అవసరం దళిత సమాజానికి లేదన్నారు. ఉన్న రిజర్వేషన్లను బీజేపీ తీసేస్తానంటోదన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీకి ఓటెయ్యమని కృష్ణమాదిగ కోరడంలో ఆంతర్యం ఏమిటన్నారు. స్వలాభం కోసమే కృష్ణమాదిగ బీజేపీ పంచన చేరారన్నారు. ఇప్పటి వరకు దళిత వర్గాలకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. దళితులు నాయకులుగా ఎదగకుండా అడ్డుకుంటూ వస్తోందన్నారు. రిజర్వేషన్లు తీసేస్తామంటూ, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ మంత్రులు బహిరంగ సమావేశాల్లో అనడాన్ని బట్టిచూస్తే కాషాయదారులకు దళితులపై ఎంత అక్కసు ఉందో అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగమే దళితులు స్వేచ్ఛగా మాట్లాడటానికి, తిరగడానికి కారణమన్నారు. దళిత రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో దళితులకు ఏనాడూ అన్యాయం జరగలేదన్నారు. వర్గీకరణకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందన్నారు. జాతీయ జెండాను గౌరవించని ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోనే బీజేపీ పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్‌ కో-ఆర్డినేటర్‌ చల్లగుళ్ల నరసింహారావు, నాయకులు గాదె చెన్నకేశవరావు, మొహమ్మద్‌ కమల్‌పాషా, ఐ.శ్రీనివాసరావు, మానుకోట ప్రసాద్‌, దోమ ఆనంద్‌, తడికమళ్ల అర్జునరావు, లంక వెంకటేశ్వర్లు, చిల్లిముంత దిలీప్‌కుమార్‌, జాజ్జారపు నవీన్‌ పాల్గొన్నారు. ఎన్‌సీసీ జాతీయ, రాష్ట్ర పొలిటికల్‌ అధ్యక్షులు అలవాల కరుణాకర్‌, పింగిలి సామేలు పాల్గొన్నారు.

Spread the love