మాగుంట రాఘవ్‌ బెయిల్‌ కుదింపు

12న సరెండర్‌ అవ్వాలని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవ్‌ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు కుదించింది. జూన్‌ 12న సరెండర్‌ కావాలని రాఘవను సుప్రీం ఆదేశించింది. మాగుంట రాఘవ్‌ కు ఢిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సుప్రీంలో సవాలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌ తో కూడిన సుప్రీం ధర్మాసనం మాగుంట రాఘవ్‌ బెయిల్‌ను 15 రోజుల నుంచి ఐదు రోజులకు కుదించింది. ఈనెల 12న స్థానిక కోర్టులో హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
”బెయిల్‌ పొందే విషయంలో రాఘవ్‌ కోర్టుకు అబద్ధాలు చెప్పారు. మోసపూరితంగా బెయిల్‌ పొందారు. తొలుత అమ్మమ్మకు, తరువాత నానమ్మకు అనారోగ్యం అన్నారు. ఆ తరువాత భార్య ఆత్మహత్యాయత్నం పేరుతో తప్పుడు ఆధారాలు ఇవ్వబోయారు. నివేదికలు, ధ్రువపత్రాలు పరిశీలించాలంటే పిటిషన్‌ వెనక్కి తీసుకున్నారు. ధనవంతులు ఇలాంటి వైద్య నివేదికలు తేవడం పరిపాటిగా మారింది. రాఘవ్‌ కు సాధారణ బెయిల్‌ ఇచ్చేందుకు ట్రయల్‌ కోర్టు నిరాకరించింది. కుటుంబసభ్యుల అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్‌కు ప్రయత్నిస్తున్నారు” అని ఈడి తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌ ఎ రాజు వాదనలు వినిపించారు. మాగుంట రాఘవ్‌ తరపు సీనియర్‌ న్యాయవాది అమిత్‌ దేశారు వాదిస్తూ రెండు వారాల గడువు ఉందని, మానవతా దృక్పథంతో బెయిల్‌ మంజూరు చేసినట్లు తెలిపారు. మాగుంట రాఘవ్‌ ఇప్పటికే బెయిల్‌పై విడుదలైనందున దాని కాలాన్ని ఐదు రోజులకు కుదిస్తున్నామన్న సుప్రీంకోర్టు.. ఈనెల 12న తప్పనిసరిగా స్థానిక కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సౌత్‌ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడి పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడి ఆరోపించింది.

Spread the love