సీల్డ్‌కవర్‌లో వివరాలివ్వండి..

– వివేకా హత్య కేసులో చార్జిషీటు, పోలీసు రికార్డులు సమర్పించాలి : సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు
– అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మాజీ మంత్రి వైఎస్‌ వివేకా నంద రెడ్డి హత్య కేసులో తన చార్జిషీటు, పోలీసు రికార్డులను సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. నర్రెడ్డి సునీతా తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, న్యాయవాది జెసల్‌ వాహి వాదనలు వినిపిస్తూ విచారణకు హాజరుకావాలని పదే పదే నోటీసులు ఇచ్చినప్పటికీ అవినాశ్‌ రెడ్డి సీబీఐ విచారణలో చేరేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు ”మినీ ట్రయల్‌” నిర్వహించిందని, ప్రాసిక్యూషన్‌ కేసు మెరిట్‌లపై ”సీబీఐ సేకరించిన సాక్ష్యాలను పట్టించుకోకుండా” అవినాశ్‌ రెడ్డి కథనాన్ని ”వాస్తవంగా అంగీకరిస్తూ” వ్యాఖ్యలు చేసిందని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ బెయిల్‌ పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు కేసు మెరిట్‌లను చర్చించలేమని స్పష్టం చేసింది. ”ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము” అని సిద్ధార్థ్‌ లూథ్రా వాదించారు. పిటిషన్‌లో ” అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయాలని కోరుకుంది. అయితే, సీబీఐ అలా చేయలేకపోయింది. ఎందుకంటే అవినాశ్‌ రెడ్డి, పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు, గూండాలు ఆస్పత్రి వెలుపల సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. ఆయన తల్లి ఆరోగ్య సమస్యల సాకుగా చూపి అరెస్టు కాకుండా ఉండటానికి ఆశ్రయం పొందారు” అని వాదించారు. రాష్ట్ర పోలీసుల సమక్షంలోనే నేరం జరిగిన స్థలాన్ని అవినాశ్‌ రెడ్డితో పాటు ఇతర నిందితులు ధ్వంసం చేశారని,వివేక గుండెపోటుతో మృతి చెందినట్టు కథనాన్ని ప్రచారం చేశారని సీబీఐ తెలిపిందని సిద్ధార్ధ్‌ లూథ్రా పేర్కొన్నారు. ఈ నేరాన్ని ”చల్లని రక్తపు హత్య” అని లూథ్రా అభివర్ణించారు.
సీబీఐ తరపున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ కేసు స్టేటస్‌ వివరించారు. అనంతరం ధర్మాసనం ఇప్పటికే ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. వెంటనే సునీత న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకొని ఇప్పటి వరకు సీబీఐ చేసిన దర్యాప్తునకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తమకు ఇవ్వాలంటూ కోరారు. దీనిపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే అవినాశ్‌ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. దీంతో రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని, దానితోపాటు చార్జిషీట్‌, కేసు ఒరిజినల్‌ ఫైల్‌ను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత మూడు వారాల్లో రిజాయిండర్‌ను దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈ కేసులు ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. గంగిరెడ్డి, అవినాశ్‌ బెయిల్‌ పిటిషన్లు కలిపే వింటామని తెలిపింది. గంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ వేరుగా వినాలని గంగిరెడ్డి తరపు న్యాయవాది కోరగా.. అవినాశ్‌ రెడ్డి బెయిల్‌తో పాటు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 11కి వాయిదా పడింది.

Spread the love