తగ్గిన దుస్తుల ఎగుమతులు

– ఆర్థిక ఇబ్బందులతో నూలు మిల్లులు సతమతం
న్యూఢిల్లీ : దేశం నుంచి వస్త్రాలు, దుస్తుల ఎగుమతులు తగ్గిపోయాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 11.3 శాతం మేర తగ్గుదల కన్పించింది. అనేక మిల్లులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండడమే దీనికి కారణం. తగినంత డిమాండ్‌ లేకపోవడంతో దక్షిణాదిన కూడా పలు మిల్లులు ఉత్పత్తిని నిలిపివేశాయి. నూలు, బట్టలు, చేనేత ఉత్పత్తుల ఎగుమతులు 1.21శాతం మేర పడిపోయాయి. చేతి పనితో చేసే ఉత్పత్తుల రవాణా కూడా 17.22 శాతం తగ్గింది. జౌళి ఉత్పత్తులు 26.72 శాతం, కార్పెట్ల ఉత్పత్తి 15.43 శాతం తగ్గిందని భారత వస్త్ర పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) తెలిపింది. గత సంవత్సరం జూన్‌లో 1,736 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన వస్త్రాలు ఎగుమతి కాగా ఈ సంవత్సరం అదే నెలలో 1,624 మిలియన్‌ డాలర్ల విలువైన వస్త్రాల ఎగుమతి మాత్రమే జరిగింది. అదే దుస్తుల ఎగుమతి విషయానికి వస్తే 1,501 మిలియన్‌ డాలర్ల నుండి 1,248 మిలియన్‌ డాలర్లకు తగ్గింది. రాబోయే రెండు నెలల్లో నూలు ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయని నూలు ఎగుమతుల అభివృద్ధి మండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సిద్ధార్ధ రాజగోపాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా తమిళనాడులోని చిన్న చిన్న వస్త్ర మిల్లులు తగిన డిమాండ్‌ లేకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేశాయి. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో మాంద్యం కారణంగా వస్త్రాలు, దుస్తుల ఎగుమతులపై ప్రభావం పడిందని సీఐటీఐ అధ్యక్షుడు టి.రాజ్‌కుమార్‌ తెలిపారు. ఎగుమతి చేయాల్సిన నూలు దేశీయ మార్కెట్‌లో ప్రవేశించిందని, ఇప్పటికే దేశంలో అవసరమైన దాని కంటే ఎక్కువ సరుకు ఉన్నదని ఆయన వివరించారు. 3 శాతం నుంచి 6 శాతం వరకూ లాభాలు రావాల్సిన పరిశ్రమ ఇప్పుడు 5 శాతం నుంచి 10 శాతం వరకూ నష్టాలలో కూరుకుపోయిందని చెప్పారు. మిల్లులన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, గత రెండు నెలల కాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే భారత వస్త్ర పరిశ్రమకు తక్షణమే ఊరట లభిస్తుందని దక్షిణభారత మిల్లుల సంఘం ఛైర్మన్‌ రవి శామ్‌ అభిప్రాయపడ్డారు. కాగా పత్తి దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న 11% సుంకాన్ని తొలగించాలని, రుణాల చెల్లింపుపై మారటోరియం విధించాలని పరిశ్రమ కోరుతోంది.

Spread the love