అతివకు అభయమివ్వని నిర్భయ ఫండ్‌

– భారతీయ మహిళల్లో భద్రతా భావాన్ని పెంపొందించటంలో విఫలం
– పర్యవేక్షణ లేమితో లోపించిన జవాబుదారీతనం
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో కదులుతున్న ఒక బస్సులో 2012 ఒక యువతిపై అతి దారుణంగా జరిగిన సామూహిక లైంగికదాడి, ఆ తర్వాత ఆమె మరణం దేశాన్ని కుదిపేసింది. ‘నిర్భయ కేసు’గా పిలవబడే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసింది. దేశంలోని మహిళలకు మెరుగైన భద్రతా చర్యల కోసం డిమాండ్‌లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా కేంద్రంలోని అప్పటి యూపీఏ-2 ప్రభుత్వం ‘నిర్భయ ఫండ్‌’ అని పిలవబడే నాన్‌-లాప్సెబుల్‌ కార్పస్‌ను రూపొందించింది.
అయితే, ఈ నిర్భయ నిధులు భారతీయ మహిళలకు మాత్రం భద్రతా భావాన్ని కలిగించలేకపోతున్నాయి. నిర్భయ ఫండ్‌లో ఇప్పటి వరకు దాదాపు 70 శాతం వినియోగించబడింది. ఏడు రాష్ట్రాలు 60 శాతం నిధులను తమ జేబులో పెట్టుకోవటంతో రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ అటకెక్కిందని గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తున్నది. కేవలం ఎనిమిది మెట్రోపాలిటన్‌ ప్రాంతాలను కవర్‌ చేసే సేఫ్‌ సిటీ ఇనిషియేటివ్‌.. రూ. 2,290 కోట్లతో నిధుల్లో సింహభాగాన్ని పొందటం గమనార్హం. అయితే, ఫండ్‌ తప్పుడు ప్రాధాన్యతలు, పేలవమైన అమలుపై అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. నిర్భయ ఫండ్‌ మహిళల్లో భద్రతా భావాన్ని పెంపొందించటంలో విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 32 శాతం మంది భారతీయ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సురక్షితంగా లేరని 2019 సర్వే ఒకటి వెల్లడించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, సుదీర్ఘ ఆమోద ప్రక్రియలు ప్రాజెక్టుల అమలుకు ఆటంకం కలిగిస్తున్నాయని నిపుణులు తెలిపారు. పటిష్టమైన పర్యవేక్షణ, మూల్యాంకణ యంత్రాంగం లేకపోవటంతో నిధుల పేలవమైన వినియోగానికి దారి తీసిందన్నారు. నిర్భయ ఫండ్‌ ద్వారా జరిగే కార్యక్రమాల అమలుపై ఏ ఒక్క ఏజెన్సీ పర్యవేక్షించనందున జవాబుదారీతనం లోపించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిర్భయ నిధులను ఖర్చు చేసే విషయంలోనూ కొన్ని రాష్ట్రాలు వెనకబడి ఉంటున్నాయి.
బీహార్‌, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఏపీ వంటి రాష్ట్రాలు, లఢక్‌ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు దారుణ ప్రదర్శన కనబర్చిన జాబితాలో ఉన్నాయి. ఇక తెలంగాణతో పాటు ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, లక్షద్వీప్‌లు నిర్భయ నిధులను చక్కగా ఖర్చు చేసిన రాష్ట్రాలు, యూటీల జాబితాలో ఉన్నాయి.

Spread the love