మోడీ విదేశాల్లో గాంధీ స్వదేశంలో గాడ్సే

– ఆయన విధానం ప్రజాస్వామ్యానికే ప్రమాదం
– రాజ్యాంగ రక్షణకే ప్రతిపక్షాల ఐక్యత
– రాష్ట్రస్థాయిల్లోనే కూటములు
– సిమ్లా సమావేశానికి మరిన్ని పార్టీలు చేరుతాయి : సీతారాం ఏచూరి
ప్రధాని మోడీ విదేశాల్లో ఉంటే గాంధీ, ఇండియాలో ఉంటే గాడ్సే అని ధ్వజమెత్తారు. మోడీ అమెరికా పర్యటనలో దేశ ప్రయోజనాలు లేవని, ఇప్పటికే ఉన్న ఒప్పందాలనే తిరగదోడారని విమర్శించారు. మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు లా కమిషన్‌ యూనిఫాం సివిల్‌ కోడ్‌పై మళ్లీ సంప్రదింపులు ప్రారంభించిందని, ఇప్పటికే 2016 నుంచి 2018 వరకు రెండేండ్ల గత లా కమిషన్‌ సంప్రదింపులు జరిపిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు లా కమిషన్‌ సంప్రదింపుల్లో అర్థం లేదని అన్నారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ను రుద్దొద్దని హితవు పలికారు. మహిళలతో సహా పౌరులందరికీ సమానత్వం హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
న్యూఢిల్లీ : ”ప్రతి రాష్ట్రంలోని పరిస్థితి భిన్నంగా ఉంటుంది. రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా చర్చలు రాష్ట్రస్థాయిల్లో జరగాలని నిర్ణయించాం. అందుకనుగుణంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుంది. రాష్ట్ర స్థాయిల్లోనే కూటములు ఏర్పాటు చేస్తాం. తమిళనాడు, బీహార్‌, మహారాష్ట్ర వలే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల అవగహనలు ఉంటాయి” అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టంచేశారు. శని, ఆదివారాల్లో సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పొలిట్‌ బ్యూరో సమావేశం తీసుకున్న నిర్ణయాలను సీతారాం ఏచూరి వివరించారు. పాట్నాలో జరిగిన సమావేశంలో ప్రతిపక్షాలన్ని కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు.
సిమ్లాలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి మరిన్ని పార్టీలు చేరుతాయన్నారు. రాజ్యాంగ హక్కులపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షణ,విద్వేష, టెర్రర్‌ రాజకీయాలను వ్యతిరేకించడం, మతోన్మాద విభజన, ప్రజాస్వామ్య హక్యులు, మానవ హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఆ సమావేశంలో నిర్ణయించామన్నారు. దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు. ప్రజా జీవనోపాధి సమస్యలైన నిరుద్యోగం, ధరలు పెరుగుదలలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఆర్థిక పురోగమనం లేదన్నారు. గత రెండేళ్లలో ఒక శాతం కార్పొరేట్ల వద్ద 40 శాతానికి పైబడి సంపద కేంద్రీకతం అయిందని, అట్టడుగున ఉన్న 50 శాతం మంది ప్రజల వద్ద కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉందని, ఆ రకంగా ఆర్థిక అసమానతలు పెరిగాయని తెలిపారు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. ఈ సమస్యలపై ప్రతిపక్షాలన్నిటితో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని అన్నారు.
మణిపూర్‌లో పరిస్థితి సంక్షోభ స్థాయికి చేరుకుందని, దీనికి కారణం మోడీ ప్రభుత్వమేనని విమర్శించారు. ప్రతి రోజూ హింస కొనసాగుతోందని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని, కానీ ఎటువంటి ఫలితం ఇవ్వలేదని విమర్శించారు. హింసకు కారణమైన ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ను తొలగించి, పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. శాంతి, సాధారణ పరిస్థితులకు మోడీ ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అక్కడి పరిస్థితులను బీజేపీ మతోన్మాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తుం దని విమర్శించారు. హిందూ మైతీలు, క్రిస్టియన్‌ కుకీల మధ్య ఘర్షణగా మార్చుతుందని దుయ్యబట్టారు. మణిపూర్‌లో బీజేపీ మతోన్మాద ఎత్తుగడలను ఆపాలని, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని, అయితే ఇదే బీజేపీ గతంలో జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై అఖిలపక్షాన్ని పంపాలని డిమాండ్‌ చేసిందని తెలిపారు. ఇప్పటికే కార్పొరేట్లు రూ.11 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశారని, ఇప్పుడు ఆర్‌బీఐ ఉత్తర్వులతో ప్రజల పొదుపులను దోపిడి చేసేందుకు చట్టబద్ధత కల్పిస్తున్నారని విమర్శించారు. రుణాలు చెల్లించే సామర్థ్యమున్నప్పటికీ, రుణాలు చెల్లించటం లేదని, వారికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రాలకు బియ్యం సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తుందని, కానీ అదే పథకాన్ని రాష్ట్రాలు అమలు చేస్తే అనుమతించటం లేదని విమర్శించారు. రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం పనికిరాదని హితవు పలికారు.

Spread the love