– పాత్రికేయులతో భేటీలో ప్రధాని మోడీ అబద్ధాలు
– పథకాల ఫలాలు అందరివీనట
– ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని స్వోత్కర్ష
‘మీ ప్రభుత్వం మైనారిటీల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందని పలు మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. విమర్శకుల నోరు మూయిస్తున్నారని అంటున్నాయి. ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కుల పరిరక్షణకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటారు?’ అని పాత్రికేయురాలు సబ్రినా సిద్ధికీ ప్రశ్నించారు. దీనికి మోడీ ఇచ్చిన జవాబేమిటో తెలుసా? భారత్‌లో కులం, మతం, జాతి వివక్ష మాటే లేదని చెప్పారు. మోడీ ఇచ్చిన జవాబు పాత్రికేయులనే కాదు, ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గత ఎనిమిది సంవత్సరాల్లో స్వదేశంలో కనీసం ఒక్కసారి కూడా పాత్రికేయులతో ముచ్చటించలేదు. మోడీ ఎప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారా అని పలువురు పాత్రికేయులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినా ప్రయోజనం శూన్యం.
అలాంటిది అమెరికా పర్యటన సందర్భంగా అనివార్యంగా మోడీ పాత్రికేయుల సమావేశంలో పాల్గొనాల్సి వచ్చింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక శ్వేతసౌధం పాత్రికేయురాలు సబ్రినా సిద్ధికీకి ఆయనను ప్రశ్నించే అవకాశం లభించింది. ‘మీ ప్రభుత్వం మైనారిటీల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందని పలు మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. విమర్శకుల నోరు మూయిస్తున్నారని అంటున్నాయి. ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కుల పరిరక్షణకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటారు?’ అని ఆమె ప్రశ్నించారు. దీనికి మోడీ ఇచ్చిన జవాబేమిటో తెలుసా? భారత్‌లో కులం, మతం, జాతి వివక్ష మాటే లేదని చెప్పారు. మానవత్వం,
మానవ హక్కులు,దేశంలో వివక్షే లేదు
మానవతావాద విలువలు లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడుంటుందని ఎదురు ప్రశ్న వేశారు. మోడీ ఇచ్చిన జవాబు దేశంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు మహదానందాన్ని కలిగించింది. ప్రశ్న అడిగిన పాత్రికేయురాలు పాకిస్తానీ అంటూ వారు ఎదురు దాడికి దిగారు. అయితే సిద్ధికీ భారత సంతతికి చెందిన అమెరికన్. కేవలం ముస్లిం పేరు ఉండడంతో ఆమెను హిందూత్వవాదులు సామాజిక మాధ్యమాల్లో ఆడిపోసుకుంటున్నారు. దీంతో ఆమె బ్లూ జెర్సీలు ధరించి, భారత క్రికెట్ జట్టుకు మద్దతు ప్రకటిస్తున్న తన ఫొటోలను, తండ్రి ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ సంగతి అలా ఉంచితే మోడీ జవాబు విని పాత్రికేయులందరూ ఆశ్చర్యానికి లోనయ్యారట. ఎందుకంటే భారత్‌లో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో ముస్లింలు తరచుగా వివక్షకు, అణచివేతకు గురవుతున్న వాస్తవాన్ని వారందరూ కథనాలుగా అందిస్తూనే ఉన్నారు మరి. అంతర్జాతీయ వేదికపై సైతం ఆయన ఎంతో తేలికగా వాస్తవాన్ని కప్పిపుచ్చటం వారిని విస్మయానికి గురిచేసింది..
మాటలు నీటి మూటలే
2014 నుంచి మోడీ, ఆయన ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే విన్యాసాలే చేస్తున్నారు. వాస్తవాలను నిర్భయంగా బయటపెట్టే మాధ్యమాల నోరు కట్టేస్తున్నారు. తద్వారా నిజమేమిటో తెలియనీయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటపడక మానదు. మోడీ పాలన విచ్ఛిన్నకర రాజకీయాలకు పెట్టింది పేరు. తిరోగమన చట్టాలు, విధానాలతో దేశం వెనకడుగు వేసేలా చేశారు. సమాజంలో ముస్లింలకు సమాన స్థాయిని కల్పించాల్సింది పోయి వారిని రెండో తరగతి పౌరులుగా మార్చారు. ఏ మతం వారైనా ప్రభుత్వ పథకాల ఫలాలు అందరికీ అందుతాయంటూ మోడీ చెబుతున్న మాటలు నీటి మూటలే. హజ్ సబ్సిడీని నిలిపివేయడం, మైనారిటీ విద్యార్థులకు అందిస్తున్న మౌలానా ఆజాద్ జాతీయ స్కాలర్‌షిప్పులు ఆపేయడం వంటి ఉదంతాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
మతాంతర వివాహాలపై చట్టాలు
మోడీ ప్రభుత్వం ముస్లింల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందన్న వాస్తవాన్ని అనేక ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. 2019లో తీసుకొచ్చిన తలాక్ చట్టం ముస్లిం మహిళల పాలిట శాపంగా మారింది. ఇదిలావుంటే హిందూ మహిళలను ‘లవ్ జిహాద్’ పేరుతో ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ గగ్గోలు పెడుతున్నాయి. అయితే ‘లవ్ జిహాద్’ ఉదంతాలపై బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిర్దిష్ట సమాచారమేదీ లేదు. ఆ పదానికి నిర్వచనమూ లేదు. కానీ 2022 సంవత్సరాంతానికి 11 రాష్ట్రాలు మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా ఏదో ఒక రూపంలో చట్టాలు చేశాయి. ‘ది కేరళ స్టోరీ’ వంటి చిత్రాలు ఈ కుట్ర సిద్ధాంతానికి ఆజ్యం పోశాయి. ఏదో ఒక రోజు దేశంలో హిందువుల సంఖ్యను ముస్లింలు దాటిపోతారని, అప్పుడు భారత్ ముస్లిం దేశం అవుతుందని దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి చిత్రాలకు ప్రధాని మోడీ స్వయంగా ఆమోదం తెలిపారు.
ముస్లింల ప్రయోజనాలకు విఘాతమే
పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకంగా ఉద్దేశించింది కాదని మోడీ ప్రభుత్వం చెబుతోంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఇబ్బందులు పడుతున్న ముస్లింలకు సాయం చేసేందుకే ఈ చట్టాన్ని రూపొందించామని అంటోంది. అయితే శ్రీలంకలోని తమిళులు, రోహింగ్యాలు, మయన్మార్‌లోని కచిన్‌లకు ఈ చట్టం ఎందుకు వర్తించదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పించే ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇది జమ్మూకాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి పైన, ముస్లింల పైన దాడి చేయడం మాత్రమే కాదు, కాశ్మీర్ ప్రజల భూమి, రాజకీయాలు, జీవితాలపై కూడా దాడి చేయడమే. రాష్ట్ర జనాభా కోసం ఉద్దేశించిన ఉద్యోగాలను స్థానికేతరులు అందిపుచ్చుకునే అవకాశాన్ని ఈ చర్య కల్పిస్తోంది. కేంద్రం నిర్ణయం ప్రకారం జమ్మూకాశ్మీర్‌లో ఇతరులు ఆస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో నివసిస్తున్న ముస్లింల ప్రయోజనాలకు ఇది విఘాతం కలిగిస్తుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
విద్వేష ప్రసంగాలు-దాడులు
2021 డిసెంబర్‌లో హిందూ మత పెద్దలు హరిద్వార్‌లో సమావేశమయ్యారు. ధర్మ సంసద్ పేరిట మూడు రోజుల పాటు జరిగిన సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. లైంగిక దాడులకు తెగబడతామని కూడా హెచ్చరికలు చేశారు. వీరిలో ఎక్కువ మందికి బీజేపీతో, సంఫ్‌ు పరివార్‌తో సంబంధాలు ఉన్నాయని తేలింది. వీరందరూ ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. గత సంవత్స రం అక్టోబర్‌లో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ వీహెచ్‌పీ ర్యాలీలో ప్రసంగిస్తూ ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ముస్లింల నివాసాలు, దుకాణాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ముస్లింలలో భయాన్ని నింపి అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. ముస్లింలు ఏ చిన్న నేరం చేసినా బుల్‌డో జర్లను పంపి వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఉదంతాలు కోకొల్లలు. చట్టం ముందు నిలబెట్టడానికి ముందే వారిని శిక్షిస్తున్నారు. అస్సాంలో మదర్సాలపై దాడులు పెరిగాయి. ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వం కొత్తగా ముస్లిం ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. కేవలం మూడు నెలల కాలంలోనే 300 ‘అక్రమ’ ప్రార్థనా స్థలాలను కూల్చేశానని నిస్సిగ్గుగా చెప్పుకుంటోంది.
దేశ ప్రధానా? హిందూ రాజా?
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మోడీ ఓ మత నాయకుడిగా ప్రవర్తించారు. తాను వివిధ మతాలు, జాతులకు నేతృత్వం వహించే వ్యక్తిననే విషయాన్ని విస్మరించారు. మసీదును కూల్చిన చోటే మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. గత నెలలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన సమయంలో కూడా మతపరమైన, బ్రాహ్మణ సంప్రదాయక పద్ధతులు పాటించారు. ఏదో లాంఛనంగా సర్వమత ప్రార్థనలు జరిపి మమ అనిపించారు. ప్రజాస్వామ్యం తమ డీఎన్‌ఏలోనే ఉన్నదని, ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి వంటిదని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకునే మోడీ తాను దేశంలోని 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. మరోవైపు స్వదేశంలో ఈ విశ్వ గురువు హిందూ ఆధిపత్య రాజకీయాలు నడుపుతున్నారు.
దేశంలో వివక్షే లేదు శ్వేతసౌధం సాక్షిగా మోడీ అసత్యాలు
5:17 am