యువకుడికి పాము కాటు..విషం విరుగుడు కోసం గంగా నదిలో ఉంచిన వైనం

నవతెలంగాణ-హైదరాబాద్ :  ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో షాకింగ్ సంఘటన జరిగింది. పాము కాటు వల్ల ఒక యువకుడు మరణించాడు. అయితే ఏదైనా అద్భుతం జరుగుతుందని కుటుంబ సభ్యులు భావించారు. విషం విరుగుతుందన్న మూఢనమ్మకంతో తాళ్లతో కట్టిన మృతదేహాన్ని గంగా నదిలో ఉంచారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జైరాంపూర్ కుడేనా గ్రామానికి చెందిన 20 ఏళ్ల మోహిత్‌ కుమార్‌ బీకామ్‌ చివరి ఏడాది చదువుతున్నాడు. ఈ నెల 4న తుది పరీక్షలు రాయాల్సి ఉంది. కాగా, ఏప్రిల్‌ 26న పార్క్‌కు వెళ్లిన మోహిత్‌ కుమార్‌ను పాము కాటు వేసింది. వాంతి కావడంతో ఇంటికి చేరుకున్న అతడు కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఆశ వదులుకోలేదు. పాము విషం విరుగుడు చేసేవారి వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లగా అతడు చనిపోయినట్లు వారు చెప్పారు. మరోవైపు గంగా నదిలో మృతదేహాన్ని ఉంచితే విషం తొలగి మోహిత్‌ బతుకవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. ఈ మూఢనమ్మకంతో తాళ్లతో కట్టిన మృతదేహాన్ని గంగా నదిలో ఉంచారు. ఇది చూసేందుకు స్థానికులు గుమిగూడారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు మోహిత్‌ మృతదేహానికి గంగా ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Spread the love