– ఆడింది ఆట…పాడింది పాట
– అన్నీ తానే…అంతా తానే
– రెజ్లింగ్ ఫెడరేషన్‌లో బ్రిజ్ ఆధిపత్య పోకడలు
– మాటలు ఘనం…చేతలు శూన్యం
కొన్ని సంవత్సరాల క్రితం ఓ సాయంకాలం. క్రీడా శాఖ మాజీ కార్యదర్శి శాస్త్రి భవన్‌లోని తన కార్యాలయంలో కూర్చొని ఉండగా ఓ ఫోన్ వచ్చింది. ఆ కాల్‌ను ఆయన తన జీవితంలో ఎన్నటికీ మరవలేరు. ఎందుకంటే ఫోన్ చేసింది అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఫెడరేషన్ చేసిన కొన్ని సిఫార్సులను ఆ కార్యదర్శి పక్కన పెట్టారు. విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించారు. జట్టు ఎంపిక ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అంతే…బ్రిజ్ భూషణ్‌లో అగ్రహం కట్టలు తెంచుకుంది. ఎందుకంటే అప్పటివరకూ ఫెడరేషన్‌లో ఆయన ఆడింది ఆట…పాడింది పాట. ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయలేదు. అందుకే కార్యదర్శికి ఫోన్ చేసి తాను ప్రజలు ఎన్నుకున్న ఎంపీని అంటూ గుర్తు చేశారు. పరుష పదజాలాన్ని ఉపయోగించారు. అయినా కార్యదర్శి లొంగలేదు. బ్రిజ్ బెదిరింపులకు పాల్పడే వ్యక్తి అంటూ ఘాటుగానే స్పందించారు.
న్యూఢిల్లీ : బ్రిజ్ తనను తాను ఓ ‘బాహుబలి’గా భావిస్తారు. తనపై మహిళా మల్లయోధులు లైంగిక ఆరోపణలు చేసినప్పటికీ, గత కొంతకాలంగా తనను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయన తొణకడం లేదు…బెదరడం లేదు. లైంగిక ఆరోపణల కేసులో బ్రిజ్‌పై ఈ నెల 15 నాటికి ఛార్జిషీటు దాఖలు అవుతుందని క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఫెడరేషన్‌ను బ్రిజ్ ఓ క్రూరుడిలా నడుపుతున్నారంటూ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ పోగట్, బజరంగ్ పునియా విమర్శలు కురిపిస్తున్నారు. అయినా ఆయన వీటిని లెక్కచేయడం లేదు. వాస్తవానికి డబ్ల్యూఎఫ్‌ఐ ఇప్పుడు వన్‌మాన్ ఫెడరేషన్‌గా మారిపోయింది. ఆయనే దానికి అధ్యక్షుడు, సెలక్షన్ కమిటీ ఛైర్మన్. అథ్లెట్ల ఫిర్యాదులు పరిష్కరించే కమిటీకి కూడా ఆయనే నేతృత్వం వహిస్తారు. జడ్జి, జ్యూరీ, నిర్ణయాన్ని అమలు చేసేదీ…అన్నీ ఆయనే. భారతీయ రెజ్లింగ్‌ను తాను ఉన్నత శిఖరాలకు చేర్చానని గొప్పలు చెప్పుకుంటారు. అయితే ఫెడరేషన్ కృషి కారణంగానే రెజ్లర్లు పతకాలు సాధిస్తున్నారన్న వాదనను సీనియర్ కోచ్ కులదీప్ షెరావత్ తోసిపుచ్చారు. మల్లయోధులు సాధిస్తున్న విజయాలలో ఫెడరేషన్ పాత్ర పరిమితమేనని అర్జున అవార్డు గ్రహీత కాకా పవార్ చెప్పారు.
వివిధ స్థాయిలలో పతకాలు సాధించిన రెజ్లర్ల విజయ యాత్రను పరిశీలిస్తే అందులో ఫెడరేషన్ పాత్ర పెద్దగా లేదన్న విషయం అర్థమవుతుంది. సాక్షి మాలిక్, సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, రవి దహియా, బజరంగ్ పునియా…వీరందరూ వేర్వేరు ప్రదేశాలలో రెజ్లింగ్ నేర్చుకున్నారు. వీరికి ఫెడరేషన్ చేసిందేమీ లేదు. ఒలింపియన్లే కాదు…జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన లింగప్ప జెనన్నవార్, రాహుల్ అవేర్ వంటి మల్లయోధులు కూడా స్వయంకృషితో పైకి వచ్చిన వారే.
అయితే ఈ వాస్తవాలను బ్రిజ్ భూషణ్ సుతరామూ అంగీకరించరు. ఫెడరేషన్‌లో లిఖితపూర్వక మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఆయన చెప్పిందే వేదం. ఉదాహరణకు జాతీయ శిబిరంలో ప్రవేశానికి కొన్ని అర్హతలను నిర్దేశించారు.
అయితే ఫెడరేషన్ అధ్యక్షుడు తనకు సంక్రమించిన అధికారాలతో ‘మంచి రికార్డు’ ఉన్న ఒక రెజ్లర్‌ను శిబిరంలో చేర్చవచ్చు. ‘మంచి రికార్డు’ అనే పదానికి నిర్వచనం మాత్రం బ్రిజ్ ఇస్తారు. ఫెడరేషన్ ఛైర్మన్‌గా బ్రిజ్ సెలక్షన్ కమిటీకి నేతృత్వం వహిస్తారు. రాబోయే మూడు నాలుగు నెలల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించే మల్లయోధులను ఆయనే ఎంపిక చేస్తారు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే రెజ్లర్లు ఫిర్యాదుల విభాగాన్ని ఆశ్రయించవచ్చు. కానీ దానికి కూడా బ్రిజ్ భూషణే నేతృత్వం వహిస్తున్నారు.
గత సంవత్సరం కామన్వెల్త్ క్రీడల నుండి స్వర్ణ పతకాలతో రెజ్లర్లు స్వదేశానికి వస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్ సెలక్షన్ ట్రయల్స్ నుండి పురుష మల్లయోధులను మినహాయించిన బ్రిజ్ భూషణ్, మహిళా రెజ్లర్ల విషయంలో మాత్రం వివక్ష ప్రదర్శించారు. సెలక్షన్ ట్రయల్స్ కూడా అన్నీ ఆయన ఇష్టప్రకారమే జరుగుతాయి. రిఫరీ ఏం చేయాలో కూడా ఆయనే నిర్దేశిస్తారు. క్రీడాకారుల తరఫున వీసా దరఖాస్తులు పంపడంలో కూడా బ్రిజ్ అలసత్వం వహిస్తారు. దీంతో చాలా మందికి సకాలంలో వీసాలు రాక పోటీలకు దూరమయ్యారు. బ్రిజ్ ఎంత నిర్దయుడంటే విమానాశ్రయ టెర్మినల్‌లో కూడా మహిళా రెజ్లర్ల చేత వర్కవుట్లు చేయించారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల కోసం శిబిరాలు నిర్వహించే సమయంలో బ్రిజ్ వేరే విషయాలపై దృష్టి సారించే వారు. ప్రణాళికలు రచించడం, సమీక్షలు జరపడంలో ఆయన పాత్ర చాలా స్వల్పం. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్షుడికి ఇష్టం లేని మాటలు ఫెడరేషన్‌లో ఎవరూ చెప్పరు. కొంతమంది రెజ్లర్లను ఎంపిక చేసుకొని వారినే పదేపదే టోర్నమెంట్లకు పంపడంతో వారిపై ఒత్తిడి పెరిగి రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు.