ఎగ్గొట్టిన పెద్దమనుషులు..
మోడీ పాలన వారికి స్వర్గధామం
– బ్యాంకులను మోసగిస్తున్నా పట్టించుకోరు
మోడీ ప్రభుత్వ హయాంలోని తొలి ఎనిమిది సంవత్సరాలలో బ్యాంకులు రూ.12 లక్షల కోట్లకు పైగా నష్టాన్ని చవిచూశాయి. ఇవేమీ కాకి లెక్కలు కావు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ ఈ నెల 15న ‘ది వైర్’ పత్రికకు రాసిన సవివరమైన లేఖలోని వాస్తవాలే. 2013-14 నుండి 2022 డిసెంబర్ 31 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులు రూ.12,09,606 కోట్ల నష్టాన్ని మూటకట్టుకున్నాయని ఆ లేఖలో తెలియజేశారు. మరి బ్యాంకులను ఆ మేరకు మోసం చేసిన ఘనులపై ఏం చర్యలు తీసుకున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. వాస్తవానికి బ్యాంకులను నట్టేట ముంచుతున్న బడా బాబులపై చర్యలు తీసుకోవడానికి బదులు ప్రభుత్వం వారిని కాపాడుతూ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రుణాల ఎగవేతదారులకు మోడీ పాలన స్వర్గధామంలా కన్పిస్తోంది. బ్యాంక్ సంఘాలు, ఆర్థిక పరిశీలకులు, పౌర సమాజం ఎంత అరచి గీపెట్టినా సరే చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా ఉంటోంది.
న్యూఢిల్లీ : స్వతంత్ర భారత చరిత్రలో బ్యాంకులకు ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిన దాఖలాలు గతంలో లేవు.
ఉద్దేశపూర్వకంగా అప్పు ఎగవేసిన వారిని, మోసం చేసిన వారిని నిషేధ జాబితాలో పెట్టి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్‌బీఐ 2019 జూన్ 7న చిట్టచివరిసారిగా బ్యాంకులకు లేఖలు రాసింది. ఇది సాధారణంగా జరిగే తంతే. ఆర్‌బీఐ కేవలం కాగితం పులిగా మాత్రమే వ్యవహరిస్తోంది. బ్యాంకులను మోసం చేసిన వారు మరింత ధనవంతులుగా మారుతున్నా కేంద్ర బ్యాంక్ పట్టించుకుంటున్న పాపాన పోలేదు. కానీ ఆర్థిక ఇబ్బందులతో రుణాలు సకాలంలో చెల్లించలేకపోతున్న చిన్నకారు రైతులపై,సామాన్య ప్రజలపై మాత్రం ప్రతాపం చూపుతోంది.
వీరంతా ఎగవేతదారులే
నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ, నిషాంత్ మోడీ, అమి మోడీ వంటి బడా గుజరాతీ పారిశ్రామికవేత్తలు పంజాబ్ నేషనల్ బ్యాంక్, అనుబంధ సంస్థల నుండి రూ.11,400 కోట్ల రూపాయలు దోచుకున్నా ఎవరూ నోరు మెదపడం లేదు. వీరందరూ ఏదో ఒక సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులే. ఇక ప్రధానికి సన్నిహితుడైన జతిన్ మెహతా 2014లోనే కుటుంబంతో కలిసి దేశం విడిచి పరారయ్యాడు. ఆయన యాజమాన్యంలోని విన్‌సమ్ డైమండ్స్ సంస్థ బ్యాంకులకు రూ.7000 కోట్లు ఎగవేసింది. గుజరాత్‌కే చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ సైతం రూ.8,100 కోట్లు ఎగనామం పెట్టింది. వీరందరూ మోడీతో తమకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని బ్యాంకులకు టోకరా వేశారు. పర్యటనల సమయంలో మోడీతో కలిసి ఫొటోలు దిగి అవసరం వచ్చినప్పుడల్లా వాటిని బయటకు తీస్తూ ఘరానా మోసాలకు పాల్పడ్డారు. గుజరాత్ వారే కాదు.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని, లిక్కర్ వ్యాపారి విజరు మాల్యా ఎస్‌బీఐ, ఇతర బ్యాంకులను రూ.10,000 కోట్ల మేర మోసం చేశాడు. రిషి కమలేష్ యాజమాన్యంలోని ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ బ్యాంకుల నుండి రూ.22,842 కోట్లు కొల్లగొట్టాయి. ఇలాంటి వ్యక్తులు, సంస్థలు ఈ తొమ్మిదేండ్లలో అనేకం.
పారు బకాయిలు గరిష్టం
పారు బకాయిలు (ఎన్‌పీఏలు) లేదా మొండి బాకీలు వసూలు చేసుకునేందుకు బ్యాంకులు సంవత్సరాల తరబడి ప్రయత్నాలు చేస్తాయి. అసలుతో పాటు ఎంతో కొంత వడ్డీని వసూలు చేసుకొంటాయి. చివరికి మిగిలిన రుణాన్ని రద్దు చేస్తాయి. బ్యాంకులకు రుణాలు ఎగవేసే వారందరూ నేరచరితులు కారు. కంపెనీలు నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రపంచంలోని అనేక దేశాలలో పారు బకాయిలు ఒకటి రెండు శాతం మాత్రమే ఉంటాయి. మన దేశంలో మాత్రం ఇవి 2018 మార్చి 31 నాటికి 11.46% మేర ఉన్నాయని ఆర్థిక మంత్రి బాహాటంగానే ప్రకటించారు. గత ఏడు సంవత్సరాలలో పారు బకాయిలు 12.17% గరిష్ట స్థాయికి చేరాయట!
అంతా ప్రజల సొమ్మే
మోడీ హయాంలో బ్యాంకులకు బకాయిలు కొండలా పెరిగి రూ.67.66 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవి రూ.54.33 లక్షల కోట్లు కాగా మిగిలినవి ప్రైవేటు, విదేశీ బ్యాంకులవి. వీటిలో ఇప్పటికే రూ.12.10 లక్షల కోట్లను పారు బకాయిలుగా ప్రకటించి రద్దు చేశారు. మోడీ పాలనలో గాలికి కొట్టుకుపోయిన ఈ పారు బకాయిల మొత్తం ప్రపంచంలోనే గరిష్టం! ఇదంతా ప్రజల పొదుపు సొమ్మే. ప్రభుత్వం అప్పుడప్పుడూ బ్యాంకులకు కొంత పెట్టుబడి పెడుతూ, ఈ నష్టాన్ని పూడుస్తూ ఉంటుంది.
అయితే ఆ డబ్బు ఎక్కడిది? మనం పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మే కదా. అంటే చివరికి నష్టపోయేది ప్రజలే. బ్యాంకు లావాదేవీలలో జవాబుదారీతనం వచ్చే వరకూ ప్రజల సొమ్మును ఇలాంటి పెద్దలు స్వాహా చేస్తూనే ఉంటారు. చట్టానికి చిక్కకుండా విదేశాలకు పలాయనం చిత్తగిస్తూనే ఉంటారు. పాలకుల అండదండలు ఉన్నంతవరకూ వీరి ఆటలు ఇలా సాగుతూనే ఉంటాయి.