ప్రకటనల కోసం

– రూ.3,064.42 కోట్లు
– మోడీ విదేశీ పర్యటనల కోసం రూ. 254.87 కోట్లు
– ఐదేండ్లలో ప్రజాధనం ఖర్చు :రాజ్యసభలో
– కేంద్రమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఐదేండ్లలో ప్రచారం చేసుకోవడానికి మోడీ సర్కార్‌ రూ.3,064.42 కోట్ల ప్రజాధనాన్ని ప్రకటనల కోసం ఖర్చు చేసింది. గురువారం రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018-19 నుంచి 2023-24 (జులై 13 వరకు) మోడీ సర్కార్‌ ప్రకటనల కోసం ప్రింట్‌ మీడియాకు రూ.1,338.56 కోట్లు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు రూ.1,273.06 కోట్లు, హౌర్డింగ్‌లు వంటి అవుట్‌ డోర్‌ ప్రకటనలకు రూ.452.8 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చు రూ. 254.87 కోట్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత ఐదేండ్లలో విదేశీ
పర్యటనలకు రూ.2,54,87,01,373 ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ తెలిపారు. 2019 ఆగస్టు నుం చి తొమ్మిది దేశాల్లో మోడీ పర్యటించారని అన్నారు.
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటర్‌కు రూ.27 పెరుగుదల
దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటర్‌కు రూ.27 పెరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. 2020 ఏప్రిల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 69.59 ఉంటే, 2023 జులై నాటికి రూ. 96.72కు పెరిగిందని, అంటే రూ.27.13 పెరిగిందని తెలిపారు. అలాగే డీజల్‌ ధర రూ.62.29 నుంచి 89.62కి, అంటే రూ.27.33 పెరిగిందన్నారు.
పెట్రోల్‌ ధర ఏపీలోనే అత్యధికం
దేశంలో పెట్రోల్‌ ధర ఏపీలోనే అత్యధికంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్‌ పన్నులకు అనుగుణంగా చమురు ధరలు ఉన్నాయని తెలిపారు.
ఏపిలో పెట్రోల్‌ లీటరుకు రూ. 111.87, డీజిల్‌ రూ. 99.61గా ఉందని అన్నారు. రెండో స్థానంలో కేరళ, తెలంగాణలు ఉన్నాయని అన్నారు. డీజిల్‌ ధరల్లో లక్షద్వీప్‌ మాత్రం తొలి స్థానంలో ఉందని, రెండో స్థానంలో ఏపీ ఉందని తెలిపారు. తెలంగాణలో మాత్రం పెట్రోల్‌ లీటరుకు రూ. 109.66, డీజిల్‌ రూ. 97.82 ఉన్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.
గ్యాస్‌ సబ్సిడీలో రూ.16,781 కోట్ల కోత
కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సబ్సీడిలో భారీగా కోత విధించింది. రూ.16,781 కోట్లు కోత విధించినట్లు కేంద్ర పెట్రోలియం, సహాజ వనరుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ తెలిపారు. ఎంపీలు రఘురామ కష్ణరాజు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన్నె శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2010-11లో గ్యాస్‌ సబ్సీడి రూ. 23,746 కోట్లు ఇస్తే, దాన్ని మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2022-23 నాటికి రూ.6,965 కోట్లకు తగ్గించారని తెలిపారు.
కేంద్రప్రభుత్వంలో 9,64,359 పోస్టుల ఖాళీ
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో 9,64,359 పోస్టుల ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 మార్చి 1 నాటికి 79 మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9,64,359 పోస్టుల ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
మూడేండ్లలో రూ.1,09,859 కోట్ల టోల్‌ ఫీజు వసూలు
మూడేండ్లలో రూ.1,09,859.02 కోట్ల టోల్‌ ఫీజు వసూలు చేసినట్లు కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల మంత్రి నితీన్‌ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020-21లో రూ. 27,923.80 కోట్లు, 2021-22లో రూ. 33,907.72 కోట్లు, 2022-23లో రూ. 48,028.22 కోట్ల టోల్‌ ఫీజు వసూలు చేసినట్లు తెలిపారు.
19,687 చిన్న పరిశ్రమలు మూత
దేశంలో గత మూడేండ్లలో 19,687 చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని కేంద్ర మంత్రి భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్న కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 01.07. 2020 జులై 1 నుంచి 2021 మార్చి 31 మధ్య 175, 2021 ఏప్రిల్‌ 1 నుంచి 2022 మర్చి 31 మధ్య 6,222, 2022 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య 13,290 ఎంఎస్‌ఎంఈలు మూత పడ్డాయని తెలిపారు. 1,32,205 ఉద్యోగులు ఉపాధికి దూరం అయ్యారని తెలిపారు.
న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రాతినిధ్యానికి ప్రతిపాదన లేదు
న్యాయమూర్తుల నియామకాల్లో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దేశంలో హైకోర్టుల్లో 335 న్యాయ మూర్తులు పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే జిల్లా, సబార్డినేట్‌ న్యాయస్థానాల్లో 5,375 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. జూలై 1 నాటికి సుప్రీం కోర్టులో 69,766 కేసులు, జులై 14 నాటికి హైకోర్టుల్లో 60,62,953 కేసులు, జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 4,41,35,357 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఓటరు కార్డుకు ఆధార్‌ లింక్‌ తప్పని సరికాదు
ఓటరు కార్డుకు ఆధార్‌ లింగ్‌ తప్పని సరికాదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మే షన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధార్‌ చట్టం-2016 ప్రకారం ఓటర్‌ ఐడీకి ఆధార్‌ లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేయలేదని తెలిపారు.
అయితే, ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం, 2021, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్‌ 23 ఆధారంగా ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు ఇప్పటికే ఉన్న లేదా కాబోయే ఓటర్లు ఆధార్‌ కార్డులను అందించాలని కోరు తున్నారు. అది కూడా స్వచ్ఛంద ప్రాతిపదికనే అని అన్నారు.
మూసీ నదిపై స్కైవే నిర్మాణానికి ప్రతిపాదన అందలేదు
మూసి నదిపై స్కైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన అందలేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు మాలోతు కవిత, జి. రంజిత్‌ రెడ్డి అగిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమా ధానం ఇచ్చారు. మూసీ నది సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ప్రతిపాదనలు అందజేయలేదని తెలిపారు.

Spread the love