మోడీ దేశ విరోధి

– పేదలను లూటీ చేసి కార్పొరేట్లకు పంచుతున్న ప్రధాని
– మెజార్టీ మీడియా కార్పొరేట్ల చేతుల్లోనే
–  క్రాస్‌ సబ్సిడీల పేరుతో పేదల సంక్షేమంలో కోత
– స్మార్ట్‌మీటర్లు పెట్టాలంటూ రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి
– మోడీ సర్కారు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆగస్టు 9,10 తేదీల్లో మహాపడావ్‌
– కార్మికులంతా జయప్రదం చేయాలి : సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానని మోసం చేశారు. డీమానిటైజేషన్‌తో సామాన్యుల బతుకులను చితికిపోయేలా చేశారు. ఓవైపు కార్పొరేట్లకు రాయితీలిస్తూ మరోవైపు పేదలపై పన్నుల భారాన్ని మరింత పెంచుతూ పోతున్నారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆర్థిక హక్కులను లాగేసు కున్నారు. కార్పొరేట్ల కోసం కార్మికుల చట్టాలను కాలరాస్తున్నారు. నేరుగా వినియోగదారుల ఖాతాల్లోకే నగదు బదిలీ అంటూ పేదల సంక్షేమ పథకాల్లోనూ కోత పెడుతున్నారు. ఇలా తన ప్రభుత్వ విధానాలతో ప్రజలను మోసం చేస్తున్న మోడీ ప్రజా విరోధి. దేశ విరోధి’ అని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఆగస్టు 9,10 తేదీల్లో తలపెట్టిన మహాపడావ్‌లో కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహిం చారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ. చంద్రశేఖర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.బాలరాజ్‌, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర నాయకులు నర్సయ్య, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు ఎస్‌ఎల్‌ పద్మ, బీఆర్‌టీయూ నాయకులు మారయ్య, ఐఎఫ్‌ టీయూ రాష్ట్ర అధ్యక్షులు అరెల్లి కృష్ణ, టిఎన్‌ టియుసి రాష్ట్ర నాయుకులు ప్రసాద్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు జనార్దన్‌ అధ్యక్షవర్గంగా వ్యవ హరించారు. అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా క్విట్‌ ఇండియా డే ప్రచార క్యాంపెయిన్‌ను ఆగస్టు 9, 10 తేదీల్లో హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ముందు ఉంచబోతున్న 15 డిమాండ్లను వివరించారు. తీర్మానాన్ని సదస్సు ఆమోదించింది.
సదస్సునుద్దేశించి తపన్‌సేన్‌ మాట్లాడుతూ ..దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్కొక్క దాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగిస్తూ పోతున్నదని విమర్శించారు. దేశ ఉత్పాదనలో కీలక పాత్ర పోషిస్తూ సంపద సృష్టిస్తున్న కార్మికులు, కర్షకులను నిండా ముంచి కార్పొరేట్ల జేబులను మోడీ సర్కారు నింపుతున్న తీరును వివరించారు. కార్పొరేట్లకు మోడీ దళారీగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మణిపూర్‌ రాష్ట్రం మండిపోతున్నదనీ, స్కూళ్లు, కాలేజీలు ఇలా అన్ని వ్యవస్థలు బంద్‌ అయి పోయాయని తెలిపారు. ఒక సెక్షన్‌ మరో సెక్షన్‌పై దాడులకు దిగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఉండటాన్ని తప్పుబట్టారు. వందేభారత్‌ రైళ్ల కోసం ఇతర రైళ్లను రెండు, మూడు గంటలు ఆపుతూ సామాన్య ప్రయాణి కులను ఇబ్బందికి గురిచేస్తున్నారనీ, అధిక చార్జీలున్న వాటితో సామాన్యులకు ఏమైనా ప్రయోజనమా? కొందరి కోసం అందర్నీ ఇబ్బంది పెట్టడం తగునా? అని ప్రశ్నించారు. విద్యుత్‌ రంగంలో స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయకపోతే నిధులు ఇవ్వబోమని కేంద్రం రాష్ట్రాలను బెదిరి స్తున్న తీరును వివరించారు. కరెంటుకు కూడా ప్రీపెయిడ్‌ రీచార్జి అంటే సామాన్యులపై భారాలు మోపడమేనన్నారు. గ్యాస్‌ సిలిండ్లరకు వినియోగ దారులే డబ్బులు చెల్లిస్తే సబ్సిడీ నేరుగా బ్యాంక్‌ అకౌంట్‌లలో వేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారనీ, స్మార్ట్‌మీటర్ల విషయంలోనూ అదే జరగ బోతుందని వివరించారు. షిప్పు యార్డులను, రవాణారంగాన్ని మోడీ సర్కారు కార్పొరేట్లకు కట్టబెడుతున్న తీరును ఎండగట్టారు. కార్పొరేట్లకు అధిక లాభాలు సంపాదించి పెట్టేందుకు కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చారని తెలి పారు. రాబోయే కాలంలో పర్మినెంట్‌ కార్మికులు ఉండబోరనీ, ఫిక్సడ్‌టర్మ్‌ ఎంప్లాయీస్‌ మాత్రమే ఉంటారని తెలిపారు. ఢిల్లీ రైతాంగ రైతాంగ పోరాట విరమణ సమయంలో రైతులకు రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. మెజార్టీ మీడి యా కార్పొరేట్ల చేతుల్లోనే ఉందనీ, అంబానీ చేతుల్లోనే ఎక్కువుందని విమర్శించారు. అందుకే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు, మతం పేరుతో చేస్తున్న రాజ కీయాలను మెజార్టీ మీడియా చూపెట్టడం లేద న్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీని తరిమికొట్టేం దుకు కార్మికులు, కర్షకులు ఐక్యమై పోరాటాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంద ని నొక్కి చెప్పారు. నిరంకుశత్వం ఎల్లకాలం సాగ దంటూ హిట్లర్‌, ముస్సోలిని గురించి తపన్‌ సేన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ”ప్రజల్ని రక్షిం చుకుందాం..దేశాన్ని రక్షించుకుందాం..”అనే నినా దంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి వై.నాగన్న, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు ఎమ్‌డీ.యూసుఫ్‌, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, సీనియర్‌ నేత నర్సయ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, బీఆర్‌టీయూ అధ్యక్షులు జి.రాంబాబుయాదవ్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంకె.బోస్‌, ఐఎఫ్‌టీయూ జాతీయ అధ్యక్షులు సాధినేని వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, ఏఐయూటీయూసీ రాష్ట్ర నాయకులు బాబూ రావు, ఇన్సూరెన్‌ రీజినల్‌ ప్రధాన కార్యదర్శి నాయకులు రవీంద్రనాథ్‌ ప్రసంగించారు.
చట్టసభల్లో వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారనీ, అక్కడ కార్మికుల అనుకూల నిర్ణయాలు జరుగు తాయని ఆశించడం భ్రమేనని అన్నారు. అయితే, కార్మికులంతా ఐక్యంగా పోరాటాల్లోకి వచ్చి పాలకులను వెనక్కి కొట్టొచ్చని చెబుతూ పలు సంఘటనలు వివరించారు. ఎన్టీఆర్‌ హయాంలో ఏడేండ్లలో మూడుసార్లు కనీసవేతనాల జీవోలను సవరించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం తొమ్మిదేండ్ల కాలంలో ఒక్కసారి కూడా సవరించలేదని విమర్శించారు. ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 12 గంటల పనివిధానం అమలవుతున్నదనీ, తెలంగాణలోనూ కనిపించని పద్ధతిలో పరిశ్రమలు కార్మికులతో 12 గంటలు పనిచేయిస్తున్న తీరును వివరించారు. దీనికి వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా కొట్లాడాల న్నారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న మోడీకి ఈ దేశాన్ని పాలించే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని సాగనంపేందుకు కార్మికులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆకలిపెరిగేకొద్దీ పోరాటాలు తీవ్రమవుతాయన్నారు. కార్పొరేట్లు దేశంలోని సహజవనరులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నారనీ, దీన్ని తిప్పికొట్టాలని కార్మికులను కోరారు.

Spread the love